Begin typing your search above and press return to search.

అప్పన్న చందనోత్సవానికి వీఐపీ భక్తులు... సామాన్యుడికి సంగతేంటి...?

By:  Tupaki Desk   |   2 May 2022 11:30 PM GMT
అప్పన్న చందనోత్సవానికి  వీఐపీ భక్తులు... సామాన్యుడికి సంగతేంటి...?
X
భగవంతుడికి భక్తుడికీ మధ్య ఉన్నది ఎవరు. ఎవరా అడ్డంకి అంటే ఇంకెవరు అధికారులే అని చెప్పాలి. దేవుడి దర్శనం హాయిగా చేసుకుందామని తపన పడే సామాన్య భక్తుడికి ఎపుడూ పరదాలే తప్ప స్వామి కటాక్షం ఉండదు. ఇక ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధమైన నారసింహ పుణ్య క్షేతం శ్రీ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం వేళ సామాన్యుడి కంటే వీఐపీలే ఎక్కువ అయ్యారు అధికారులకు. ఏకంగా పందొమ్మిది వేల టికెట్లను వీఐపీలకు కేటాయించి మమ అనిపించేశారు అధికారులు.

ఇక వీరి దర్శనానికి అయిదు గంటల సమయం కేటాయించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున వీఐపీలు రాకతో వారి దర్శనానికి కచ్చితంగా పది నుంచి పన్నెండు గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు. మరి స్వామి దర్శనం కోసం ఈసారి లక్షన్నర మంది సామాన్య భక్తులు వస్తారని లెక్క వేస్తున్నారు. వీరు కాకుండా మరో ముప్పై వేల మంది మూడు వందల రూపాయల టికెట్ మీద దర్శనానికి క్యూ కడుతున్నారు. టోటల్ గా చూస్తే చందనోత్సవ వేళ నిజరూప దర్శనానికి ఏకంగా రెండు లక్షల మంది భక్తులు రావచ్చు అన్నది కచ్చితమైన అంచనా.

ఎందుకంటే కరోనా కారణంగా గత రెండేళ్ళుగా స్వామి వారి చందనోత్సవానికి భక్తులకు అనుమతి లేదు. ఏకాంతంగానే చందనోత్సవాన్ని జరిపించారు. దాంతో ఈసారి అన్నీ కలసి రావడంతో అప్పన్న నిజరూపాన్ని ఎలాగైనా దర్శించుకోవాలని భక్తులు సదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఏపీ వ్యాప్తంగా ఉన్న భక్త జనం అపుడే సింహాచలం వైపుగా క్యూ కడుతున్నారు.

అయితే వచ్చే సామాన్య భకులకు స్వామి వారి దర్శనాన్ని జాగ్రత్తగా చేయించడంతో ఎపుడూ విఫలమయ్యే అధికారులు ఈసారి కూడా చేస్తున్న అరకొర ఏర్పాట్లతో తిప్పలు తప్పవు అంటున్నారు. మండే మే నెల ఎండలో కొండనెక్కి స్వామి దర్శనం చేసుకునే భక్తుల కంటే వీఐపీలే ఎక్కువ అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

సామాన్య భక్తులకు దర్శనానికి కేటాయించే సమయాన్ని కుదించి అయినా వీఐపీలకు అవకాశం ఇచ్చేలా జరుగుతున్న తంతు, చేస్తున్న ఏర్పాట్లతో ఈసారి సామాన్యుడు అప్పన్నా ఏదీ నీ దయ మాకు అని కొండ దగ్గరే మొరపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేవలం చందనోత్సవం వేళ ఒక్క రోజే రెండున్న‌ర కోట్ల రూపాయల ఆదాయం టికెట్ల రూపంలో ఆలయానికి రావచ్చు అని లెక్కలు చెబుతున్నాయి. టిక్కెట్ల రేట్లు కూడా అలా పెంచేశారు మరి.

ప్రతీ ఏటా స్వామికి చందనం తొలగించి భక్తులకు నిజ రూప దర్శనం చేయిస్తారు. ఆ వైశాఖ మాసలో వచ్చే అక్షర తదియ వేళ ఆ రోజు కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మరి సామాన్యులకు స్వామికీ మధ్య అడ్డు తెర ఎపుడు తొలగుతుందో. దర్శనం ఎపుడు జరుగుతుందో. అంతా అప్పన్నే చూసుకోవాలి అని అపుడే భక్తులు వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.