Begin typing your search above and press return to search.

పెళ్లి ఆహ్వానమంటే ఇది కదా.. వైరల్‌గా కేరళ జంట ఆహ్వాన పత్రిక!

By:  Tupaki Desk   |   20 Nov 2022 2:30 AM GMT
పెళ్లి ఆహ్వానమంటే ఇది కదా.. వైరల్‌గా కేరళ జంట ఆహ్వాన పత్రిక!
X
వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటారు. సాక్షాత్తూ దేవతలే పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యముంటుంది. అందుకే కేరళ జంట తమ వివాహాన్ని మరింత మధురం చేసుకోవాలనుకున్నారు.

ఈ క్రమంలో ఇండియన్‌ ఆర్మీకి తమ పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ఒక నోట్‌ను కూడా స్వదస్తూరితో రాసి వారికి పంపారు. ఇప్పుడు ఆ ఆహ్వాన పత్రికను ఇండియన్‌ ఆర్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

కేరళకు చెందిన రాహుల్, కార్తీకలకు నవంబర్‌ 10న పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జంట తమ పెళ్లికి రావాలని కోరుతూ భారత సైన్యానికి ఆహ్వాన పత్రికను పంపింది.

ఇందులో... ‘మేము (రాహుల్, కార్తీక) నవంబర్‌ 10న పెళ్లి చేసుకోబోతున్నాం. మన దేశం పట్ల మీ ప్రేమ, దృఢ సంకల్పం, నిజమైన దేశభక్తికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని వారు రాశారు.

అలాగే.. ‘మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు మేము మీకు రుణపడి ఉంటాము. మీ వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము. మా ప్రియమైన వారితో మాకు సంతోషకరమైన రోజులను అందించినందుకు ధన్యవాదాలు. మీ వల్ల మేము సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాము. మేము మా ప్రత్యేక రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మేము మీ రాకను, ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. మమ్మల్ని రక్షిస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఇండియన్‌ ఆర్మీకి పంపిన ఆహ్వాన పత్రికతోపాటు నోట్‌లో పేర్కొన్నారు.

కేరళ జంట వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను ఇండియన్‌ ఆర్మీ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది, ‘బెస్ట్‌ విషెస్‌’... వివాహ ఆహ్వానం పంపినందుకు ఇండియన్‌ ఆర్మీ రాహుల్‌ – కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ జంట చాలా సంతోషకరమైన – ఆనందకరమైన వివాహ జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటోంది’ అని తన శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇండియన్‌ ఆర్మీ పోస్టు ఇన్‌స్ట్రాగామ్‌లో వైరల్‌గా మారింది. దాదాపు లక్ష మంది దీన్ని లైక్‌ చేశారు. ఒక నెటిజన్‌ ఇలా పేర్కొన్నాడు.. ‘మన నిజమైన హీరోల పట్ల మన హృదయాల్లో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం ఉత్తమం‘ అని రాశారు. మరొక నెటిజన్‌.. ‘వావ్, ఇది అత్యుత్తమ వివాహ ఆహ్వానం. మన నిజమైన హీరోలకు జై హింద్‌.‘ అని కామెంట్‌ చేశాడు. ఇంకొకరు.. ‘ఇది నిజంగా అద్భుతం!’ అని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.