Begin typing your search above and press return to search.

వైర‌ల్ పిక్స్ః తెలంగాణ‌కు మ‌ణిహారం యాదాద్రి ఆల‌యం - కేటీఆర్‌

By:  Tupaki Desk   |   13 Jun 2021 6:30 AM GMT
వైర‌ల్ పిక్స్ః  తెలంగాణ‌కు మ‌ణిహారం యాదాద్రి ఆల‌యం - కేటీఆర్‌
X
యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి ఆల‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా పున‌ర్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా కొన‌సాగుతున్న ఈ ప‌నులు.. ఈ ఏడాది పూర్తికానున్న‌ట్టు తెలుస్తోంది. ఆల‌య ప్రాకారం వంటి ప్ర‌ధాన ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే మంత్రి కేటీఆర్ అద్భుత‌మైన యాదాద్రి ఆల‌య చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిత్రాల్లోని శిల్ప‌క‌ళా శోభిత ఆల‌యం.. భ‌క్తుల‌ను ఆనందంలో ముంచెత్తుతోంద‌ని చెప్పొచ్చు.

ఈ మేర‌కు ట్వీట్ చేసిన కేటీఆర్‌.. ఇంత గొప్ప ప‌నిచేసిన ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు ధ‌న్యావాదాలు తెలిపారు. ‘‘గౌరవనీయ సీఎం కేసీఆర్ గారు.. తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన ఆల‌యాన్ని అలంక‌రించారు. దేశంలోని భ‌క్తులంద‌రి కోసం అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పున‌ర్నిర్మించారు.’’ అని రాసుకొచ్చారు. ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు.. త్వరలో మరికొన్ని ఆవిష్కరించబడతాయని చెప్పారు.

హైదరాబాద్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యం అభివృద్ధికి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు. దాదాపు 39 కిలోల బంగారం, 1,753 టన్నుల వెండితో ప్ర‌ధాన ఆల‌య‌ గోపురాలను నిర్మించారు. కేటీఆర్ పోస్ట్ చేసిన చిత్రాల్లో ఆల‌య క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డుతోంది.

కాగా.. ఈ ఆల‌య నిర్మాణ పనుల‌న్నీ ఈ పాటికే తుదిద‌శ‌కు చేరుకోవాల్సింది కానీ.. క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప‌నుల‌న్నీ మంద‌గించాయి. నిత్యం దాదాపు వెయ్యి మంది కార్మికులు ప‌నిచేయాల్సి ఉండ‌గా.. ఇప్పుడు కేవ‌లం 300 మందితోనే ప‌నులు సాగుతున్న ప‌రిస్థితి. యాదాద్రి గుట్ట‌పై ప్ర‌ధాన ఆల‌యం లోప‌ల‌, ప్రాకార మండ‌పాలు, అందులో సౌక‌ర్యాలు క‌ల్ప‌న, రోడ్లు, ఘాట్ రోడ్డు విస్త‌ర‌ణ‌, క్యూ లైన్లు, పార్కింగ్ ఇలా.. ప‌లు ప‌నులు పెండింగ్ లో ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌నుల‌కు రూ.848 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. మ‌రో రూ.400 కోట్లు అవ‌స‌ర‌మ‌ని అధికారులు ప్ర‌భుత్వానికి లెక్క‌లు పంపించిన‌ట్టు స‌మాచారం. ఈ డ‌బ్బులు కేటాయించి.. మిగిలి ఉన్న ప‌నుల‌న్నీ పూర్తిచేసిన త‌ర్వాత‌ ఆల‌య ఉద్ఘాట‌న జ‌రిపించాల‌ని సీఎం భావిస్తున్నార‌ని తెలుస్తోంది.