Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో.. వార్ ఫీల్డ్ లో వెగటు పుట్టేలా అతి రిపోర్టింగ్

By:  Tupaki Desk   |   19 April 2022 12:30 PM GMT
వైరల్ వీడియో.. వార్ ఫీల్డ్ లో వెగటు పుట్టేలా అతి రిపోర్టింగ్
X
కాలం మారుతోంది. అందుకు తగ్గట్లు ఆసక్తులు మారుతుంటాయి. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ.. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బేసిక్స్ ను మర్చిపోవటం.. అందరిని ఆకర్షించాలంటే ఏదో ఒక అతి ఉండాలన్న నిశ్చితాభిప్రాయాన్ని చూస్తే.. ఇదెక్కడి పైత్యం రా బాబు.. అన్న భావన కలగటం ఖాయం. గతంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే.. దానికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవటానికి విదేశీ ఏజెన్సీలు.. మీడియా సంస్థల రిపోర్టుల ఆదారంగా వార్తల్ని అందించేవి మీడియా సంస్థలు.

సాంకేతికత పెరిగిపోవటం.. మిగిలిన వారికి భిన్నంగా.. అందరికంటే అడుగు ముందు ఉండేలా.. వార్తలు అందించేందుకు మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పోటీతోనే.. హిందీ న్యూస్ చానల్ టీవీ9 భారత్ వర్ష్ దూసుకెళ్లేలా చేసింది.

అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అజ్ తక్ కు షాకిచ్చింది. గతంలో జరిగిన యుద్ధాలకు భిన్నంగా తాజాగా ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేయటం కోసం మన దేశం నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులను పంపాయి మీడియా సంస్థలు చివరకు.. తెలుగు టీవీ చానళ్లు సైతం తమ ప్రతినిధుల్ని పంపటం కొత్త పరిణామంగా చెప్పాలి.

తమను ఫాలో అయ్యే వారి కోసం మీడియా సంస్థలు ఇచ్చే ప్రాధాన్యతలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి తీరును అభినందించాల్సిందే. కాకుంటే.. అది మోతాదు మించనట్లుగా ఉండాలి. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ చానల్ కు చెందిన రిపోర్టర్ యుద్ధ క్షేత్రం నుంచి రిపోర్టింగ్ చేస్తోంది. ఓకే.. అదేం తప్పు కాదు.

ఆ మాటకు వస్తే అభినందనీయమే. కాకుంటే.. ఆ రిపోర్టరమ్మ వీరావేశంతో ఊగిపోతూ.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో నిలబడి.. అదే పనిగా ఊగిపోతూ.. అవసరానికి మించిన హడావుడి.. ఆవేశాన్ని కలగలిపి వార్తల్ని అందిస్తున్న తీరుకు ఏడవాలో.. నవ్వాలో అర్థం కాని పరిస్థితి.

ఎందుకిలా? అంటే.. మిగిలిన వారి కంటే భిన్నంగా.. వీక్షకుల అటెన్షన్ కోసమన్న మాటల్ని వింటే.. 'అతి'కి ఎంత అందమైన అర్థం చెబుతున్నారో అన్న భావన కలుగక మానదు. రానున్న రోజుల్లో ఇలాంటి వికారపు రిపోర్టింగులు మరెన్ని చూడాల్సి వస్తుందో?