Begin typing your search above and press return to search.

భారత క్రికెట్ కోహినూర్.. విరాట్ కోహ్లి

By:  Tupaki Desk   |   5 Nov 2021 9:40 AM GMT
భారత క్రికెట్ కోహినూర్.. విరాట్ కోహ్లి
X
విరాట్ కోహ్లి.. వర్తమాన క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రికార్డులు.. ఆట పట్ల అంకితభావం.. గెలవాలన్న కసి.. అంతకుమించిన ఫిట్నెస్.. అతడి సొంతం. విదేశీయులు, వారి ఆటగాళ్లు సైతం అభిమానించేంత ప్రతిభ విరాట్ సొంతం. నవంబరు 5తో కోహ్లి 33 ఏళ్లు పూర్తి చేసుకుని 34 వ ఏట అడుగు పెడుతున్నాడు. ఆటగాడిగా ఎప్పుడో ఉన్నత శిఖరాలు అధిరోహించిన విరాట్.. కెరీర్ పరంగా ప్రస్తుతం కీలక దశలో ఉన్నాడు.

టి20 ప్రపంచకప్ అనంతరం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఇటీవలే ప్రకటన చేశాడు. బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ఎంతో విజయవంతం అయిన కోహ్లి మున్ముందు మరింత రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. ఎంత లేదన్నా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అనేది భారమే. అందులోనూ భారీ అంచనాలుండే భారత జట్టుకు సారథ్యం అంటే మాటలు కాదు. దాదాపు ఆరేళ్లుగా కోహ్లి టెస్టులు, వన్డేలు, టి20ల్లో భారత్ కు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే, రెండేళ్లుగా మాత్రం బ్యాటింగ్ లో వెనుకబడ్డాడు. కోహ్లి చివరి సారి అంతర్జాతీయ మ్యాచ్ లో సెంచరీ చేసింది ఎప్పుడో తెలుసా..? 2019 నవంబరు. అంటే రెండేళ్లుగా విరాట్ నుంచి మూడంకెల స్కోరు లేదు.

మైదానంలో హెల్మెట్ తీసి అభివాదం చేసిందీ లేదన్నమాట. ఈ రెండేళ్లలో

సమకాలీలైన, బిగ్ ఫోర్ గా చెప్పుకొనే (కోహ్లి, రూట్, విలియమ్సన్, స్మిత్) వారిలో మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి వెనుకబడింది మాత్రం నిజం. ఈ నేపథ్యంలోనే కోహ్లి కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏడాది రెండేళ్లలో వన్డే కెప్టెన్సీని వదులుకునే అవకాశం ఉందని సమాచారం.

అప్పటికి ఇప్పటికి ఎంత తేడా?

కుర్రతనంలోని దూకుడు, ఫిట్నెస్ ఇలా ఏ అంశంలోనూ 2008 నాటి కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి అసలు పోలికే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్నది ఓ పరిపూర్ణ కోహ్లిని. కెరీర్ ప్రారంభంలో వచ్చిన హైప్ కారణంగా కొన్నాళ్లు వైఫల్యాలను ఎదుర్కొన్నాడు విరాట్. ఇది అందరికీ ఎదురయ్యే అనుభవమే. ఇక్కడే.. తప్పులను దిద్దుకొని చాంపియన్లు ఎవరో, సాధారణంగా మిగిలిపోయేది ఎవరో తేలిపోతుంది. అలా ఛాంపియన్ గా నిలిచినవాడు కోహ్లి. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మలుచుకున్న తీరు ఎవరికైనా ఆదర్శమే. 2008 నుంచి 2011 వరకు సగటు బ్యాట్స్ మన్ అయిన కోహ్లి ఆ తర్వాత తనను తాను మలుచుకున్నాడు. టెక్నిక్ మార్చుకుని వేల కొద్దీ పరుగులు రాబట్టాడు. సాధారణంగా ఓ స్థాయి క్రికెటర్ ఎవరూ తమ టెక్నిక్ ను మార్చుకునేందుకు ఇష్టపడరు. కానీ, కోహ్లి అలా కాదు. కెరీర్ కోసం ఏమైనా చేసే రకం. అందుకనే ఏ ఇంగ్లాండ్ లో అయితే విఫలమయ్యాడో అదే ఇంగ్లాండ్ లో 2019లో టెస్టుల్లో సెంచరీల మీద సెంచరీలు కొట్టి శభాష్ అనిపించుకున్నాడు.

పట్టుకుంటే వదలడు..

కోహ్లికి కెరీర్ అంటే ఎంత ప్రాణమో.. తనను ప్రోత్సహించిన వారన్నా, ఇష్టపడిన వారన్నా అంతే ఇష్టం. ఒక్కసారి కమిట్ అయితే వదలని రకం. విరాట్ కెరీర్ తొలినాళ్లలో చేసిన షాంపూ యాడ్ లో అనుష్క శర్మ పరిచయం అయింది. అది కాస్త పెరిగి ప్రేమగా మారింది. అలాఅలా.. బంధం బలపడింది. ఈ లోగా కోహ్లి పెద్ద స్టార్ అయ్యాడు. కానీ, అనుష్కను మాత్రం విస్మరించలేదు. అలాగే,బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు విషయంలోనూ ఇంతే. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇదే జట్టుకు ఆడుతున్నాడు కోహ్లి. ఈ రికార్డు మరెవరికీ లేకపోవడం విశేషం.

ఇక ఏం చేయబోతున్నాడు..?

తనపై ఒత్తిడిని కొంత తగ్గించుకుని మైదానంలో జట్టుకు బలంగా మారాలన్నది కోహ్లి ఆలోచనగా భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ మూల స్తంభమైన తాను రాణిస్తే భారత్ ఎంత పెద్ద మ్యాచ్ నైనా గెలిచేయగలదు. ధోని రిటైరవడం, రోహిత్ శర్మకు సైతం వయసు పెరుగుతుండడం, ధావన్ కు చాన్సులేకపోవడానికి తోడు ఓవైపు జట్టులోకి కుర్రాళ్లు వస్తున్న సందర్భంలో కోహ్లి బాధ్యత మరింత పెరుగుతోంది. అందుకని సారథ్యం వదిలేసి బ్యాటింగ్ పై ఫోకస్ చేయాలని భావించినట్టు తెలుస్తోంది.

అంటే.. గతంలో సచిన్ మాదిరిగా కోహ్లి జట్టులో బ్యాట్స్ మన్ గా కొనసాగుతూ మార్గనిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

అనుష్క స్పెషల్ ఫొటో

విరాట్ జన్మదినం సందర్భంగా భార్య అనుష్క శర్మ తనతో దిగిన ఓ ఫొటోను పంచుకుంది.

‘‘నువ్వు ప్రతిరోజూ అభివృద్ధి చెందుతూనే ఉంటావని నాకు తెలుసు.. మనం సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునే రకం కాదు. నువ్వు ఎంత అద్భుతమైన మనిషివో ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంటుంది. నీ మనస్తత్వం గురించి తెలిసిన వ్యక్తులు అదృష్టవంతులు. ప్రతిదాన్ని మరింత అందంగా చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే` అంటూ భర్తకు శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫొటోకు, నీ జీవన విధానానికి ఫిల్టర్ అవసరం లేదు. నిరాశ నుంచి త్వరగా బయటపడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు అని అందులో పేర్కొనడం కోహ్లి వ్యక్తిత్వాన్ని చెబుతోంది.