Begin typing your search above and press return to search.

జీఎస్టీ బిల్లుకు కోహ్లీకి ఉన్న సంబంధమేమిటి?

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:18 AM GMT
జీఎస్టీ బిల్లుకు కోహ్లీకి ఉన్న సంబంధమేమిటి?
X
పార్లమెంటులో నిన్నంతా జీఎస్టీ బిల్లుపైనే చర్చ. లోక్ సభలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొంది నిన్న రాజ్యసభలోనూ ఓకే అనిపించుకుంది. అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లుపై పెద్దల సభలో సభ్యులు అత్యంత సీరియస్ గా చర్చించుకుంటున్న సమయంలో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తావన కూడా వచ్చింది. జీఎస్ టీకి - విరాట్ కోహ్లీకి ఉన్న సంబంధాన్ని ఓ సభ్యుడు విడమరిచి చెప్పడంతో సభ్యులంతా ఆసక్తిగా విన్నారు. అయితే... జీఎస్ టీకి - క్రికెటర్ కోహ్లీకి సంబంధం ఏంటనుకుంటున్నారా... అయితే, మొత్తం చదవాల్సిందే.

రాజ్యసభలో జీఎస్ టీపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి జీఎస్ టీ బిల్లుకు ముడిపెట్టారు. జీఎస్ టీ బిల్లు అత్యవసరంగా ఆమోదించాలని చెప్పిన ఆయన దాని అవసరాన్ని చెబుతూ ఇప్పటికే ఎంతో ఆలస్యమైందంటూ బిల్లు ప్రస్థానాన్ని ఒక కథలా చెప్పుకొచ్చారు. అందులో విరాట్ కోహ్లీని పాత్రధారి చేయడంతో అందరూ ఆసక్తిగా విన్నారు. డెరెక్ ఏం చెప్పాడంటే... ‘‘ఢిల్లీలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడున్నాడు. ఈ జీఎస్ టీ బిల్లు గురించి పాలకులు తొలసారి ఆలోచించిన కాలంలో పుట్టిన బాలుడు అతడు. బిల్లు సభకు వచ్చిన 2005 సంవత్సరంలో అతడు పదో తరగతిలో ఉన్నాడు. ఇప్పుడు అతను దేశానికే వన్నెతెస్తూ, ఘనమైన విజయాలు సాధిస్తున్నాడు. అతని పేరు విరాట్ కోహ్లీ. మన దేశంలో అటువంటి విరాట్ కోహ్లీలు లక్షల మంది ఇప్పుడు మనవైపు - మన ప్రసంగాల వైపు చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం - రేపటి భారతావని కోసం మనం చర్చించాలి. జీఎస్టీ బిల్లును చట్ట రూపంలోకి తెచ్చి అమలు చేయాలి. ఎంత వేగంగా ఈ పని చేస్తే అంత మేలు కలుగుతుంది" అని డెరెక్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కోహ్లీకి ముడిపెడుతూ ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతా చెవులు రిక్కించి విన్నారు.

టీవీ ప్రజెంటర్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన డెరెక్ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. పార్లమెంటులో తరచూ ఆసక్తికర ప్రసంగాలు చేస్తుంటారు. జీఎస్ టీ బిల్లుపై అందరూ ఎంతో మాట్లాడినా డెరెక్ ప్రసంగం మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది.