Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో కోహ్లీ - మోడీ

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:44 AM GMT
ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో కోహ్లీ - మోడీ
X
క్రికెట్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కి ఉగ్ర ముప్పు పొంచి ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐఏ)కు ఓ లేఖ అందింది. విరాట్ తో పాటు బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి సిరీస్ ఆడనున్న భారత క్రికెట్ జట్టుకి ఉగ్రముప్పు ఉందని ఎన్‌ ఐఏ చెప్పింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బంగ్లాదేశ్‌ తో భారత్ తొలి టీ20లో తలపడనుండగా, అదే రోజు భారత క్రికెటర్లపై దాడి చేయబోతున్నట్లు బెదిరింపు లేఖలో ఉందని బీసీసీఐకి ఎన్‌ ఐఏ సమాచారం అందించింది.

దీనితో ఢిల్లీ పోలీసులు ఆ అనామక లేఖని బీసీసీఐ సెక్యూరిటీ ఏజెన్సీకి పంపి జట్టు భద్రతని సమీక్షించుకోవాలని సూచించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మ్యాచ్‌ని చూసేందుకు వచ్చే రాజకీయ ప్రముఖులు తమ మెయిన్ టార్గెట్‌ అని ఆ లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని కోజికోడ్‌ కు చెందిన ఆల్ ఇండియా లష్కర్ ముఠా నుండి ఈ లేఖ అందినట్టు సమాచారం. దీనితో జట్టు భద్రతని కట్టుదిట్టం చేయాలనీ - భారత హోంమంత్రిత్వ శాఖ - ఢిల్లీ పోలీసులను బీసీసీఐ కోరింది. దీనితో ఇప్పటినుండే పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసారు. అలాగే ప్రస్తుతం బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న కోహ్లీ భద్రత పైనా అధికారులు దృష్టి పెట్టారు.

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - హోంమంత్రి అమిత్ షా - బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ - బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా మరియు స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు కూడా లేఖలో ఉన్నాయని సమాచారం. వీరందరిలో విరాట్ కోహ్లీనే మెయిన్ టార్గెట్‌ అని తెలుస్తోంది. ఇంతకుముందు కూడా వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన సమయంలో ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. మరోసారి అలాంటి బెదిరింపులే వచ్చాయి. ఈసారి మాత్రం చాలా సీరియస్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది.