Begin typing your search above and press return to search.

వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ రెస్టారెంట్

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:35 AM GMT
వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ రెస్టారెంట్
X
టీమిండియా సారథిగా సుపరిచితుడైన కోహ్లీకి మరిన్ని వ్యాపారాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ హోటల్ చైన్ లో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఈ రెస్టారెంట్లు ఉండగా.. మహారాష్ట్రలోని ఫూణెలో ఏర్పాటు చేసిన హోటల్ మీద కొత్త ఆరోపణలు సంచలనంగా మారాయి. ఫూణె రెస్టారెంట్ లోకి స్వలింగ సంపర్కులు.. ట్రాన్స్ కమ్యునిటీని అనుమతించటం లేదన్న ఆరోపణలు వచ్చాయి.

భిన్న లింగ జంటలు.. సిస్ జెండర్ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ఆగ్రహాం వ్యక్తమవుతోంది. ఫూణెతో పాటు ఇతర నగరాల్లోని కోహ్లీ రెస్టారెంట్లలో ఇదే తీరును అనుసరిస్తున్నట్లుగా ఆరోపణలు మొదలయ్యాయి. ఒకవైపు స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితం (2018) తీర్పును ఇవ్వటం తెలిసిందే.

ఐపీసీ 377 సెక్షన్ కింద స్వలింగ సంపర్కం నేరం కాదని స్పష్టం చేసినప్పటికీ సమాజంలో అలాంటి వారికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు మాత్రం దక్కట్లేదు. ఇలాంటివేళ.. కోహ్లీ రెస్టారెంట్ అలాంటి జంటల ప్రవేశానికి నో చెప్పిందన్న ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో ఈ వివాదంపై ఒక పోస్టులో.. ‘విరాట్ కోహ్లీ.. నీకు ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ మీ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్' అతిథుల పట్ల వివక్ష చూపిస్తున్నది. మిగిలిన బ్రాంచిలు కూడా ఇలాంటి పాలసీలనే అనుసరిస్తున్నాయి. ఇది నిజంగా ఆమోదయోగ్యం కాదు' అంటూ ఒక మహిళ పేర్కొన్నారు.

ఈ నిబంధనను సాధ్యమైనంత త్వరగా మార్పు చేస్తావని ఆశిస్తున్నట్లుగా సదరు నెటిజన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సూచనతో పాటు జొమాటో యాజమాన్యాన్ని కూడా ట్యాగ్ చేస్తూ.. ఇలాంటి రెస్టారెంట్లతో బిజినెస్ చేయటం ఆపండి.. వారికి సరైన పద్దతులు నేర్పించండంటూ పేర్కొన్న వైనం మరింత కాక పుట్టేలా చేసింది.

సోషల్ మీడియాతో పాటు.. మీడియాలోనూ ఈ వ్యవహారం అంతకంతకూ ముదురుతున్న వేళ.. వన్8 కమ్యూన్ స్పందించింది. తాము అందరిని ఒకే రీతిలో ఆహ్వానం పలుకుతామని.. జెండర్ వివక్షను తాము చూపటం లేదని స్పష్టం చేసింది. తమకు అందరి పట్ల గౌరవం ఉందన్న ఆ సంస్థ.. తాము వ్యాపారాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

అయితే.. సింగిల్ పురుషుల్ని మాత్రం అనుమతించటం లేదని.. జంటల్ని మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొంది. సింగిల్ గా వచ్చే పురుషుల కారణంగా మహిళలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనను పెట్టామని.. అందులో ఎలాంటి వివక్ష లేదంది. మరి.. ఈ వివాదానికి ఇప్పటికైనా చెక్ పడుతుందా? మరింత ముదురుతుందా? అన్నది చూడాలి.