Begin typing your search above and press return to search.

ఐపీఎల్ : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇక గతం .. ఘోర అవమానం !

By:  Tupaki Desk   |   12 Oct 2021 7:16 AM GMT
ఐపీఎల్ : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇక గతం .. ఘోర అవమానం !
X
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ లో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి నిష్క్రమించింది. సీజన్ మధ్యలోనే కెప్టెన్‌ గా తనకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించిన కోహ్లీకి టైటిల్‌ తో గౌరవంగా సెండాఫ్ ఇవ్వాలని ఆశించిన బెంగళూరు టీమ్, ఎలిమినేటర్‌ లో పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. దాంతో.. టైటిల్ కల నెరవేరకుండానే కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఇకపై కూడా ఐపీఎల్‌ లో ఆడినన్ని రోజులూ బెంగళూరు టీమ్‌ కే ప్రాతినిథ్యం వహిస్తానని చెప్పుకొచ్చిన కోహ్లీ.. టీమ్‌ లో ఉన్నా అది బ్యాట్స్‌మెన్‌ గా మాత్రమేని స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ 140 మ్యాచ్‌ ల్లో బెంగళూరు టీమ్‌ ని నడించాడు. ఇందులో 66 మ్యాచ్‌ల్లో బెంగళూరు టీమ్ విజయం సాధించగా 70 మ్యాచ్‌ ల్లో ఓడిపోయింది. ఓ నాలుగు మ్యాచ్‌ ల్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016 ఐపీఎల్‌ సీజన్‌లో అత్యద్భుతంగా రాణించిన కోహ్లీ.. బెంగళూరు టీమ్‌ని ఒంటిచేత్తో ఫైనల్‌ కి చేర్చాడు. కానీ.. టైటిల్ పోరులో సన్‌ రైజర్స్ హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. అలానే 2017, 2019లో బెంగళూరు టీమ్ చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కోహ్లీ సహచరులు రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీతో పాటు గౌతమ్ గంభీర్ కూడా ఐపీఎల్ టైటిళ్లని ముద్దాడారు.

కానీ.. 2013 నుంచి 2021 వరకూ ప్రయత్నించినా.. కోహ్లీ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. కెప్టెన్‌ గా చివరికి కోహ్లీకి ఆ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆధునిక క్రికెట్ లో ఓ చాంపియన్ ప్లేయర్. ఎన్నో రికార్డుల్ని అవలీలగా బ్రేక్ చేసిన మొనగాడు. కింగ్ కోహ్లీ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సచిన్ రికార్డుల్ని బద్దలు కొట్టే ప్లేయర్ కోహ్లీ అనే అంతగా ఎదిగాడు. కానీ, అతని కెరీర్ లో ఓ మాయని మచ్చ అతన్ని వెంటాడనుంది.

2013 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ఆర్‌ సీబీకి కెప్టెన్‌ గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్‌ ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌ లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్‌ గా పని చేసిన కాలంలో ఆర్‌ సీబీ ఒకసారి రన్నరప్(2016 ఐపీఎల్‌ సీజన్‌), మరో మూడుసార్లు ప్లే ఆఫ్స్‌(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్‌గా ఆర్‌ సీబీకి టైటిల్‌ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్‌ మన్‌ గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. కోహ్లీ లాంటి చాంపియన్ ప్లేయర్ కు ఇది కచ్చితంగా ఓ నిరాశే లాంటిది. తన కెరీర్ లో ఐపీఎల్ టైటిల్ లేదన్న నిజం అతన్ని వెంటాడుతునే ఉంటుంది. ఇది కచ్చింగా కోహ్లీకి అవమానమే అంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక, ప్లేయర్ గానూ విరాట్ కోహ్లీ టైటిల్ కొట్టలేదు. వచ్చే ఏడాది అయినా, ఆ లోటు ను తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోవైపు, మనోడి ఖాతాలో ఐసీసీ టైటిల్ కూడా లేదు. వచ్చే, టీ -20 ప్రపంచకప్ లో ఆ టైటిల్ కొట్టి.. తన వెంటాడుతున్న లోటును భర్తీ చేస్తాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.