Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ వారి ప‌నేనా?

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 PM GMT
విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ వారి ప‌నేనా?
X
భార‌త క్రికెట్ ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అంత‌గా ఫామ్ లో లేని సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు మంచినీళ్ల తాగినంత సులువుగా ఫార్మాట్ ఏదైనా సెంచ‌రీలు బాదేసిన విరాట్ ఇప్పుడు ఫామ్ లోకి రావ‌డానికి చెమ‌టోడుస్తున్నాడు. విరాట్ ఏ ఫార్మాట్ లో అయినా సెంచ‌రీ చేసి మూడేళ్లు దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు సెంచ‌రీ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇంటా బ‌య‌టా అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి,

అయితే తోటి ఆట‌గాళ్లు, కోచ్ నుంచి మాత్రం విరాట్ కోహ్లీకి మంచి మ‌ద్ద‌తే ల‌భిస్తోంది. విరాట్ ఫామ్ పుణికిపుచ్చుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని.. ఒక్క‌సారి అత‌డు ఫామ్ లోకి వ‌చ్చాడంటే అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని చెబుతున్నారు.

అత‌డి వీరాభిమానులు సైతం అదే చెబుతున్నారు. కాగా గ‌త ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్), తాజాగా ఇంగ్లండ్ తో జ‌రిగిన సిరీస్ ల్లో విరాట్ నుంచి చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్సులు రాలేదు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ చివరి టెస్టులోనూ, ఆ తర్వాత ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో విరాట్ విఫ‌లమ‌య్యాడు.

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డే విరాట్ ఆడ‌లేదు. అతడికి గాయమైందని ఆ మ్యాచ్ కు ముందు రోజే వార్త బయటికి వచ్చింది. అయితే దీన్ని వివాదాస్ప‌దం చేయాల‌నుకుంది.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ. కోహ్లిని గాయం పేరుతో కావాల‌నే త‌ప్పించార‌నే అర్థం వ‌చ్చేలా అత‌డిపై ట్వీట్ చేసింది. అందులోనూ వెరిఫైడ్ అకౌంట్ నుంచి పోస్టు పెట్టడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు మద్దతుగా ఈ ట్విట్ట‌ర్ ఖాతా న‌డుస్తుంటుంది.

ఈ నేప‌థ్యంలో వ‌న్డే మ్యాచుల‌కు ముందు భార‌త క్రికెటర్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డానికి ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు పెట్టింది. ‘dropped’ అనే పదానికి ‘Abdomen groin injury’ అని అర్థం అని ఆ పోస్టులో పేర్కొంది. విరాట్ కోహ్లీని టీమ్ నుంచి త‌ప్పించి గాయాన్ని కార‌ణంగా చూపార‌నేది ఈ ట్వీట్ ఉద్దేశం.

ఈ ట్వీట్ స‌హ‌జంగానే కోహ్లి అభిమానులకు తీవ్ర ఆగ్రహం క‌లిగించింది. ఆ ట్వీట్ కు ధీటుగా వాళ్లు రిప్లై ఇస్తున్నారు. కోహ్లీ రికార్డుల‌ను పేర్కొంటూ ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏ ఇంగ్లండ్ ఆట‌గాడు క‌ల‌లో కూడా విరాట్ రికార్డుల‌ను అందుకోలేని చెబుతున్నారు. ఫామ్ లో లేక‌పోతే విరాట్ లాంటి ప్ర‌పంచ స్థాయి బ్యాట్స‌మ‌న్ ని ఎలా అవ‌మానిస్తార‌ని మండిప‌డుతున్నారు.