Begin typing your search above and press return to search.

ఆ బ్యాంకుల్లో ఎంతేసినా నో చెప్పవ్..

By:  Tupaki Desk   |   13 Nov 2016 4:28 PM GMT
ఆ బ్యాంకుల్లో ఎంతేసినా నో చెప్పవ్..
X
విషయం ఏదైనా ఎంతోకొంత ఎటకారం చేసుకోవటం భారతీయులకు కాస్త అలవాటే. కష్టంలో ఉన్నా.. చిరాకులో ఉన్నప్పటికీ మనసులోని విసుగుకు వ్యంగ్యాన్ని జోడించే తీరు దేశ ప్రజలకు అలవాటే. తాజాగా అలాంటి కోణాన్నే ప్రదర్శించి అందరి మనసుల్ని దోచుకుంటున్నారు ఒకప్పటి డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్. బ్యాటుతో క్రీజులోకి వచ్చినప్పుడు ప్రత్యర్థుల బంతుల్ని ఎంత కఠినంగా శిక్షించేవారో.. సరిగ్గా ఆ తరహాలోనే తన ట్వీట్స్ తో చెలరేగిపోవటం.. రాజకీయ నేతలు మొదలు ఎవరికైనా సరే ట్వీట్లతో వాతలు పెట్టాలంటే వీరేంద్ర సెహ్వాగ్ తర్వాతే ఎవరైనా అన్న పేరు ప్రఖ్యాతుల్ని సాధించేశారు.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటన నేపథ్యంలో..వీరేంద్ర సెహ్వాగ్ తనదైన రీతిలో స్పందించారు. డిసెంబరు 31 వరకూ బ్యాంకుల్లో ప్రజలు తమ వద్దనున్న రూ.వెయ్యి.. రూ.500నోట్లను డిపాజిట్ చేయొచ్చన్న వెసులుబాటును గుర్తుచేస్తూ.. కేంద్ర సర్కారు ప్రకటించిన గడువుతీరిన తర్వాత కూడా ఐదు బ్యాంకులు పాత నోట్లను స్వీకరిస్తాయని వ్యాఖ్యానించారు.

ఆ ఐదు బ్యాంకులు మరేవోకావంటూ వాటి డిటైల్స్ వెల్లడించారు. సెహ్వాగ్ పేర్కొన్న సదరు బ్యాంకుల పేర్లు చూస్తే.. ‘‘బ్యాంక్స్ ఆఫ్ గంగా.. యమునా.. సరస్వతి.. నర్మద.. గోదావరి’’లుగా సెహ్వాగ్ పేర్కొన్నారు. ఈ ఐదు బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని వేసినా.. ఏమీ అనవని ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ కూడా ఉండదంటూ తనదైన కొంటెతనాన్ని జత చేసి మరీ ట్వీట్ చేశారు. ఇంట్లో ఉన్న నల్లధనాన్ని ఏం చేయాలో తోచక కిందామీదా పడిపోతుంటే.. సెహ్వాగ్ మాత్రం అందుకు భిన్నంగా జోకులు వేయటం గమనార్హం.