Begin typing your search above and press return to search.

తెల్లోడి అహంకారాన్ని ‘మాట’తో కొట్టిన వీరూ

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:46 AM GMT
తెల్లోడి అహంకారాన్ని ‘మాట’తో కొట్టిన వీరూ
X
తెల్లోడి మాటలన్నీ గురివింద లెక్కనే ఉంటాయి. తమ నలుపు గురించి చెప్పరు కానీ.. మిగిలినోళ్ల నలుపు గురించి మాత్రం చెబుతుంటారు. అదీ కూడా మేధావుల లెక్కన. తాజాగా రియో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శనతో రెండంటే రెండే పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోట్లాది మంది భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా.. వెళ్లిన వారిలో ఇద్దరు పతకాలతో తిరిగి రావటంపై భారత్ పండగ చేసుకుంటూనే.. పతకాలు సాధించిన వారిని నెత్తిన పెట్టుకుంది. సంబరాలు చేసుకుంది. కానీ.. ఈ తీరు తెల్ల మీడియాకు ఏ మాత్రం నచ్చలేదు. వారు తమ అసహనాన్ని..ఇరుకు మనస్తత్వాన్ని మీడియా సాక్షిగా ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. ఈ తీరుపై భారతీయులు పలువురు మండిపడగా.. అందరి కంటే మిన్నగా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మాటలతో చురకలు అంటించటమే కాదు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో బదులివ్వటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రియో ఒలింపిక్స్ లో భారత పేలవ ప్రదర్శన.. పతకాలు సాధించిన వారి విజయాల్ని దేశం సంబరాలు చేసుకోవటాన్ని ‘తెల్ల’ మీడియా తెగ ఇదైపోయింది. బ్రిటన్.. న్యూజిలాండ్ కు చెందిన మీడియా సంస్థ ఒకటి.. మీడియా ప్రతినిధి ఒకరు తమకున్న చిన్నబుద్ధిని తన ఆర్టికల్స్ రూపంలో ప్రదర్శించాయి. రెండంటే రెండే పతకాల్ని సాధించిన భారత్ సంబరాలు చేసుకోవటాన్ని తప్పు పడుతూ నోరు పారేసుకున్నారు. ఒలింపిక్స్ తో భారత్ ప్రదర్శన అత్యంత చెత్తగా ఉందంటూ న్యూజిలాండ్ కు చెందిన ఒక మీడియా సంస్థ అవసరానికి మించిన ఓవరాక్షన్ ప్రదర్శించింది.

‘‘120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబరాలు జరుపుకోవటం ఎంత చికాకు కలిగించే విషయం’’ అంటూ మోర్గాన్ అనే బ్రిటీష్ మీడియా ప్రతినిధి వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేక వ్యక్తమైంది. ఇతర దేశాలపై నోరు పారేసుకునే ముందు సొంత పనిని చూసుకోవాలంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎవరైనా.. ఏదైనా గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవటం మీ కల్చరల్ లో చికాకు కలిగించే విషయం కావొచ్చు కానీ.. మా దేశ సంస్కృతిలో మాత్రం కాదంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇంకోవైపు ‘ఒలింపిక్స్ ఇండియా వరస్ట్ కంట్రీ’ పేరుతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఒక కథనాన్ని వండి వార్చింది. జనాభా.. జీడీపీ ప్రకారం చూసుకుంటే ఒలింపిక్స్ లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇండియాదే చెత్త ప్రదర్శనగా పేర్కొంది.

ఈ విమర్శలపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ వీరూ చేసిన వ్యాఖ్య ఏమిటంటే.. ‘‘మేం చిన్న చిన్న ఆనందాల్ని కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ.. క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లండ్ ఇప్పటివరకూ వరల్డ్ కప్ గెలవలేదు. అయినా వరల్డ్ కప్ ఆడుతుండటం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది’’ అంటూ విరుచుకుపడ్డాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు పాజిటివ్ గా రెస్పాండ్ కావటమే కాదు.. ఆయన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా సంతోషాన్ని వ్యక్తం చేసిన వారిలో టీమిండియా క్రికెటర్ కోహ్లీ ఒకరు. సెహ్వాగ్ ట్వీట్ పై స్పందిస్తూ.. ‘‘దీన్నేకుక్క కాటుకు చెప్పుదెబ్బ’’ అంటూ ముక్తాయించారు. తెల్లోడి అహంకారాన్ని తన మాటతో దెబ్బేసిన సెహ్వాగ్ పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.