Begin typing your search above and press return to search.

దక్షిణాసియాలోనే తొలిసారి వర్చువల్ శవ‘పరీక్ష’.. ఢిల్లీలో

By:  Tupaki Desk   |   21 March 2021 5:13 AM GMT
దక్షిణాసియాలోనే తొలిసారి వర్చువల్ శవ‘పరీక్ష’.. ఢిల్లీలో
X
మరణించటం ఒక ఎత్తు.. మరణించిన వారి శరీరానికి జరిగే శవపరీక్ష మరో ఎత్తు. ప్రాణం లేని శరీరాన్ని కోయటం.. వివిధ భాగాల్ని పరీక్షించటం.. ఈ క్రమంలో కుట్లు వేయటం లాంటి వాటిని బాధితుల కుటుంబ సభ్యులు అస్సలు తట్టుకోలేరు. శవపరీక్ష తర్వాత వారికి అప్పగించిన డెడ్ బాడీల్ని చూసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆవేదనకు గురవుతుంటారు. అసలు ముట్టుకోకుండా.. శవపరీక్ష సాధ్యం కాదా? అంటే.. సాధ్యమేనని చెప్పొచ్చు.

అసలు కోయకుండా.. ముట్టుకోకుండా శవపరీక్ష జరిగేందుకు వర్చువల్ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. పలు ప్రాశ్చాత్య దేశాల్లో ఈ వర్చువల్ విధానం అమల్లో ఉంది. తాజాగా అలాంటి సాంకేతికతను దేశ రాజధాని ఢిల్లీలో షురూ చేశారు. ఎయిమ్స్ లో తొలిసారి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరణించిన వారికి సైతం గౌరవప్రదంగా పరీక్షలు జరిపేందుకు ఈ వర్చువల్ పద్దతి అవకాశం ఇస్తుందని చెబుతన్నారు.

అమెరికా.. ఆస్ట్రేలియా.. స్విట్టర్లాండ్ లాంటి ధనిక దేశాల్లో ఈ వర్చువల్ విధానంలో ఆటోప్సీ అమల్లో ఉంది. దక్షిణాసియా.. ఆగ్రేయాసియా లాంటి చోట్ల ఈ విధానాన్ని తొలిసారి తీసుకొస్తున్నది మోడీ సర్కారే. ఈ విధానంలో ఉండే మరో ప్రయోజనం ఏమంటే.. మామూలు పద్దతిలో శవపరీక్షకు ఆరు గంటల వరకు సమయం పడితే.. వర్చువల్ పద్దతిలో కేవలం 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది.

ఇంతకీ ఈ విధానంలో పోస్ట్ మార్టం ఎలా చేస్తారన్న విషయానికి వెళితే.. మరణించిన వారి డెడ్ బాడీని వారి సైజులో ఉండే ఒక బ్యాగులో సీల్ చేస్తారు. సిటీ స్కాన్ లేదంటే ఎంఆర్ఐ లోకి పంపుతారు. అలా కొన్ని సెకన్ల వ్యవధిలోనే శరీరంలోని అన్ని భాగాల్ని ఫోటోల్ని తీసేస్తుంది. అది కూడా భారీగా. ఒక లెక్క

ప్రకారం దాదాపు 25వేల ఫోటోల్ని తీస్తుంది. దీంతో.. మామూలు పరీక్షలో కనిపించని అంశాల్ని.. ఈ విధానంలో విశ్లేషించే వీలుంది. అంతేకాదు.. డెడ్ బాడీని ముట్టుకోనందున.. మరోసారి శవపరీక్షచేయాల్సి వస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే తరహా టెక్నాలజీని ప్రతి రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా కేంద్రం ఆలోచిస్తే.. వర్చువల్ విధానం బాధితుల విషాదాన్ని కొంతమేర అయిన తగ్గిస్తుందని చెప్పక తప్పదు.