Begin typing your search above and press return to search.

ఏపీ అధికార వర్గాల్లో ఆందోళన: అధికారులు, ఎమ్మెల్యేలని వదలని వైరస్

By:  Tupaki Desk   |   28 Jun 2020 12:30 PM GMT
ఏపీ అధికార వర్గాల్లో ఆందోళన: అధికారులు, ఎమ్మెల్యేలని వదలని వైరస్
X
వైరస్ రాష్ట్రంలో భయానకంగా విస్తరిస్తోంది. రోజూ వందల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా బలి తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అధికారులు వైరస్ బారిన పడుతున్నారు.

ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడికి వైరస్ సోకింది. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడూ వైరస్ వ్యాపించింది. ఇది ఇలా ఉంటే అధికారులు కూడా వైరస్ బారిన పడుతున్నారు.

వైరస్ బారిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు పడ్డారు. ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం వారు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. వైరస్ బారిన పడినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని సమాచారం. అసింప్టోమేటిక్‌గా వారిని నిర్ధారించారు. ర్యాండమ్‌గా వారికి పరీక్షలు చేయగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురే కాకుండా మరో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా వైరస్ సోకిందనే వార్త అధికారుల్లో కలకలం రేపుతోంది. మరికొందరు అధికారులకు కూడా సోకిందని తెలుస్తోంది. దీంతో వారంతా కొద్దిరోజులుగా విధులకు హాజరు కావడం లేదని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి కూడా పాజిటివ్ వచ్చింది. సచివాలయ ఉద్యోగుల్లో చాలా మందికి లక్షణాలు కనిపిస్తున్నాయి. వేర్వేరు శాఖల్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే 15 మందికి వైరస్ సోకింది. దీంతో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భయాందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక శాఖలను పర్యవేక్షించే అధికారి దీని బారిన పడటం కలకలం రేపుతోంది. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలను కలిగి ఉన్న అధికారి కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.