Begin typing your search above and press return to search.

వానాకాలం షురూ.. వణుకు పుట్టిస్తున్న వైరస్​లు

By:  Tupaki Desk   |   6 Jun 2022 7:44 AM GMT
వానాకాలం షురూ.. వణుకు పుట్టిస్తున్న వైరస్​లు
X
కరోనా మరోసారి తన పంజా విసరడం మొదలెట్టింది. నాలుగో దశ షురూ అయినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వానాకాలం కూడా మొదలవుతోంది. వానాకాలంలో మరిన్ని రకాల వైరస్లు వ్యాపిస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేరళలో వెస్ట్ నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్ లో చికెన్ పాక్స్, ఉత్తరప్రదేశ్ లో మంకీపాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంటే.. ఇప్పుడు కొవిడ్ మరోసారి విజృంభిస్తూ మళ్లీ దడ పుట్టిస్తోంది.

భారత్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను చూస్తుంటే నాలుగో దశ ప్రారంభమైందనే అనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటింది.

ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.

బాలీవుడ్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మే 25న కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి వెళ్లిన వారిలో కనీసం 50 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారం. హీరో షారుక్ ఖాన్, హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్లు తమకు కరోనా సోకినట్లు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సర్కార్ మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్‌ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతుందని సూచిస్తోంది.

వివిధ రకాల వైరస్లకు పుట్టినిల్లయిన కేరళలో మరో కొత్త వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. త్రిశూర్కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి మృతి చెందడంతో ఆ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవి.. కానీ తీవ్రంగా సోకితే మాత్రం ప్రాణాలు పోతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. 150 మందిలో ఒకరికి ఈ వైరస్‌ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పింది. వైరస్‌ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుందని పేర్కొంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్‌ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి.

మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్‌ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ బాలిక శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్‌ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది. ఆ బాలికను క్వారంటైన్‌లో ఉంచినట్టుగా ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ త్యాగి వెల్లడించారు.

ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్‌ పాక్స్‌ మాదిరిగానే మంకీ పాక్స్‌ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్‌ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు.

వానాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే చికెన్ పాక్స్ మధ్యప్రదేశ్ను వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్‌పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణీలు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది.