Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో వైర‌స్ క‌ల‌క‌లం: ‌ఓ ఉద్యోగికి పాజిటివ్‌?

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:42 PM GMT
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో వైర‌స్ క‌ల‌క‌లం: ‌ఓ ఉద్యోగికి పాజిటివ్‌?
X
మహమ్మారి వైర‌స్ తెలంగాణ‌లో గాండ్రిస్తోంది. రోజురోజుకు ఉధృతి పెరుగుతోంది. తాజాగా ఒక్క‌రోజే 206 కేసులు, ప‌ది మ‌ర‌ణాలు చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న రేపుతోంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్‌లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. భారీగా కేసులు నమోదవుతుండడంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వైర‌స్ సాధార‌ణ ప్ర‌జల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు - అధికారుల‌కు కూడా సోకుతుంది. తాజాగా ఈ వైర‌స్ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు పాకింది. బేగంపేట‌లోని మెట్రో రైల్‌ భవన్‌ లో పనిచేస్తున్న సీఎంఓ ఉద్యోగికి పాజిటివ్‌ అని తేలిందని స‌మాచారం. ఇటీవలే అత‌డి కుమారుడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ కు వచ్చాడంట‌. ఆ స‌మ‌యంలో అత‌డి కుమారుడికి వైర‌స్ సోక‌గా తాజాగా అత‌డి నుంచి తండ్రికి సోకింది. దీంతో సీఎంఓ ఉద్యోగికి వైరస్‌ సోకిందని గుర్తించార‌ని తెలుస్తోంది.

ఈ వార్త ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో క‌ల‌వ‌రం రేపుతోంది. ఈ క్ర‌మంలోనే కార్యాల‌యానికి ఎవ‌రూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. కొద్దిరోజుల పాటు సీఎంఓ కార్యాలయంలో కార్యక్ర‌మాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. అత‌డికి వైర‌స్ సోక‌డంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు మొత్తం 30 మంది సిబ్బంది న‌మూనాలు ప‌రిశీలించిన‌ట్లు ఓ మీడియా తెలిపింది. సీఎంఓలో అధిక మొత్తంలో సీనియర్ సిటిజన్స్ విధులు నిర్వ‌హిస్తున్నారు. దీంతో సీఎంఓలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ వార్త తెలియ‌గానే సీఎంఓ మొత్తం శానిటైజేషన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ వైర‌స్ వార్త తెలియ‌గానే పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ విధులు నిర్వహిస్తున్నట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.