Begin typing your search above and press return to search.

అసోంలో క‌ల‌క‌లం: ‌రోడ్డెక్కి ధ‌ర్నా చేసిన వైర‌స్ బాధితులు

By:  Tupaki Desk   |   17 July 2020 4:30 PM GMT
అసోంలో క‌ల‌క‌లం: ‌రోడ్డెక్కి ధ‌ర్నా చేసిన వైర‌స్ బాధితులు
X
పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తులు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయి రోడ్డెక్కారు. అనంత‌రం రోడ్డుపై బైఠాయించి ధ‌ర్నా చేసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న అసోం రాష్ట్రంలో జ‌రిగింది. వైర‌స్ రోగులు ఆందోళన చేప‌ట్ట‌డం తొలిసారి. అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో ఉన్న ఓ క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి కొంతమంది పాజిటివ్ సోకిన వారు తప్పించుకొని బయటకు వెళ్లారు. ఆ త‌ప్పించుకున్న వారు అక్కడి జాతీయ రహదారి మీదకు వెళ్లి ధ‌ర్నా చేశారు. ఎందుకంటే తమకు సరైన ఆహారం, నీళ్లు అందించడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై ధ‌ర్నా చేయ‌డం అక్క‌డి అధికారుల‌ను షాక్‌కు గురి చేసింది.

తాము చికిత్స పొందుతున్న క్వారంటైన్ సెంట‌ర్‌లో 10 నుంచి 12 మందిని ఒకే గ‌దిలో పెడుతున్నారని వైర‌స్ బాధితులు ఆరోపించారు. ఈ విషయం ఆ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఏకంగా వైర‌స్ బాధితులు ఆందోళ‌న చేయ‌డంతో జాతీయ ర‌హ‌దారిపై వెళ్తున్న వాహ‌న‌దారులు.. ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న చెందారు. దీంతో ఆ రోడ్డుపై భారీగా వాహ‌నాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. మీరు ముందుగా‌ క్వారంటైన్‌ సెంటర్‌కి తిరిగి వెళ్లాలని.. అక్కడ మాట్లాడుదామ‌ని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు సరైన సౌకర్యాలు సమకూర్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో వైర‌స్ బాధితులు శాంతింతి.. అక్క‌డి నుంచి క్వారంటైన్ సెంటర్‌కి వెళ్లారు.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి హిమంత భిశ్వ శర్మ స్పందించి మాట్లాడారు. క్వారంటైన్ సెంటర్‌లో రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవచ్చు అని తెలిపారు. తాము వారిని క్వారంటైన్‌కి తీసుకొచ్చేది మిగిలిన వారికి వైరస్ అంటకుండా ఆపేందుకేన‌ని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ వారికి నచ్చకపోతే ఇంటికి వెళ్లి అక్కడ క్వారంటైన్‌లో ఉండొచ్చు అని పేర్కొన్నారు.