Begin typing your search above and press return to search.

విజయవాడలో కలకలం: ఆర్టీసీ బస్సులో వైరస్ బాధితురాలు

By:  Tupaki Desk   |   15 July 2020 6:45 AM GMT
విజయవాడలో కలకలం: ఆర్టీసీ బస్సులో వైరస్ బాధితురాలు
X
ఆర్టీసీ బస్సులో వైరస్ బాధితురాలు ప్రయాణించారనే వార్త ప్రజలతో పాటు ఆర్టీసీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్త విజయవాడలో కలకలం రేపుతోంది. జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లగా సాధారణ జ్వరమని తేల్చి చెప్పారు. ఈ నెల 6వ తేదీన అనుమానంతో వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా.. 12వ తేదీన పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను విజయవాడలోని ఆస్పత్రికి రావాలని సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లగానే అక్కడ బెడ్‌లు ఖాళీగా లేవని.. హోం క్వారంటైన్‌లో ఉండమని సిబ్బంది చెప్పారు.

దీంతో ఆమె ఈ విషయాన్ని వెంటనే తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది. అతడు తల్లిని తీసుకొచ్చేందుకు ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నించగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె రాత్రంతా ఆస్పత్రి ఆవరణలోనే పడుకుంది. చివరకు ఆమె మంగళవారం ఉదయం ఆటోలో వెళ్లి బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సెక్కి సొంత ఊరికి చేరుకుంది. అప్పటికే పాజిటివ్ వచ్చిన వార్త తెలుసుకున్న స్థానికులు మళ్లీ ఆమె ఇంటికి రావడంపై ఆందోళన చెందారు. దీంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారంతో ఆమెను మళ్లీ విజయవాడ తీసుకెళ్లడానికి సచివాలయ, 108 సిబ్బందితో కుటుంబసభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు స్పందించి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆమెను చివరకు విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ పరిస్థితికి కారణమేంటి.. బాధ్యులు ఎవరనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.