Begin typing your search above and press return to search.

గంటాకు తిరుగుబాటు తంటా

By:  Tupaki Desk   |   18 Oct 2016 8:06 AM GMT
గంటాకు తిరుగుబాటు తంటా
X
చంద్రబాబు కేబినెట్ లోని మంత్రి గంటా శ్రీనివాసరావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా విశాఖపట్నంలోని మిగతా ఎమ్మెల్యేలు - ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారనే టీడీపీ వర్గాలు అంటున్నాయి. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. విశాఖలోని ఫిలింనగర్ సొసైటీకి చేసిన భూకేటాయింపులపై విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మంగళవారం వారంతా సమావేశమై గంటా తీరుపై గరంగరం అయినట్లు సమాచారం. ఫిలింనగర్ కారణంగా తొట్లకొండ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం కలుగుతుందని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ విషయంలో పలువురు ఎమ్మెల్యేలు గంటాపై విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఫిలింనగర్ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు చెబుతున్నారు. గంటా పైరవీల కారణంగానే వారంలోనే ఫైళ్లన్నీ రెడీ అయ్యాయని ఆరోపిస్తున్నారు.

విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395 - 413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను ఫిల్మ్ నగర్ సొసైటీ పేరిట ఇచ్చేశారు.. అక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో అధికారులు సొసైటీపరం చేసినట్లు ఆరోపిస్తున్నారు. రూపాయి కూడా లీజు మొత్తం చెల్లించకుండానే ఇచ్చేశారట. అంతేకాదు... వారం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడ ఫిలింనగర్ కోసం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు.

దీంతో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా గంటా ఇష్టారాజ్యం భూములిచ్చేశారని వారంతా ఫైరవుతున్నారు. విశాఖ ఎంపీ హరిబాబు కూడా భూముల కేటాయింపుపై గుర్రుగా ఉన్నారు. పరిశ్రమలకు - వాటర్ క్లబ్‌ కు భూములివ్వమని కోరితే లేవని చెబుతున్న మంత్రులు ఫిలింనగర్ కు 17 ఎకరాలు అప్పనంగా ఎలా ఇచ్చేశారని ఆయన అంటున్నారు. దీనిపై చంద్రబాబును కలిసి వాస్తవాలు వివరిస్తూ గంటాపై ఫిర్యాదు చేయడానికి ఆ జిల్లా ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/