Begin typing your search above and press return to search.

విశాఖ గ్యాస్ లీక్ ... ఓ కుటుంబంలో తీరని శోకం !

By:  Tupaki Desk   |   9 May 2020 6:09 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ ... ఓ కుటుంబంలో తీరని శోకం !
X
ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలతో పోరాడుతున్న విశాఖ వాసులకి ...గ్యాస్ లీక్ ఘటన మరిన్ని కష్టాలని తీసుకువచ్చింది. ఈ ఘటన స్థానిక వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12మంది చనిపోగా వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వీరంతా విశాఖలో కేజీహెచ్‌ తో పాటూ ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. కొంతమంది బాధితులు ఇప్పటికే కోలుకోగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే కుదుటపడుతోంది. అందరూ కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే, ఈ ప్రమాదం ఓ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఘటనలోనే గోవిందరాజు అనే వ్యక్తి చనిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఎల్జీ పాలిమర్స్‌ లోనే రోజుకూలీగా పనిచేసేవాడు. గోవిందరాజు మరణం గురించి శుక్రవారం వరకు కుటుంబ సభ్యులకు తెలియలేదు. మీడియాలో ఫోటోలను చూసి కేజీహెచ్‌ కు వచ్చారు.. గోవిందరాజు డెడ్‌ బాడీని గుర్తించారు. ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు

ఇదిలా ఉంటే, ఆయనకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ బాలుడు కూడా గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురయ్యాడు.. చిన్నారి ఇప్పిటికీ కళ్లు తెరవలేకపోతున్నాడు. కేజీహెచ్‌ లోనే చికిత్సపొందుతున్నాడు. కన్నతండ్రిని కడసారి చూసేందుకూ కళ్లు తెరవలేకపోవడం అందర్నీ కలిచివేస్తోంది. బాలుడి కళ్లకు చికిత్స చేయించేందుకు ఐ స్పెషలిస్టుల్ని తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి చూసి స్థానికులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.