Begin typing your search above and press return to search.

విశాఖ మాస్టర్ ప్లాన్ 2041 పేరు వింటేనే అక్కడోళ్లంతా వణుకుతున్నారా?

By:  Tupaki Desk   |   23 July 2021 3:55 AM GMT
విశాఖ మాస్టర్ ప్లాన్ 2041 పేరు వింటేనే అక్కడోళ్లంతా వణుకుతున్నారా?
X
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మహా నగరాలకు మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తుంటారు. ఇందులోభాగంగా సిద్ధం చేసిన విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ.. సింఫుల్ గా చెప్పుకోవాలంటే (వీఎంఆర్ డీఏ) రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041కు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజం చెప్పాలంటే విశాఖ.. దాని చుట్టుపక్కల ఉండే వారిలో ఈ మాస్టర్ ప్లాన్ మాట వణుకు తెప్పిస్తోంది. దీనికి కారణంగా.. ఇందులో ప్రతిపాదించిన అంశాలే కారణం. ఈ మాస్టర్ ప్లాన్ ను యథాతధంగా అమలు చేస్తే.. తమ ఊళ్లు.. పొలాలు మొత్తం పోతాయని.. వేలాది మందిని దారుణంగా దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ‘మా ఊళ్లు ఉంటాయో లేదో తెలీదు. ప్లాట్లు కొన్న లేఔట్లు మాయం కావటం ఖాయం. పొలాలు సైతం రోడ్లలోకి వెళ్లిపోతాయి’ అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

విశాఖపట్నం.. విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన డెవలప్ మెంట్ ప్లాన్ ముసాయిదాను సిద్దం చేశారు. ఇందులో భీమిలి.. భోగాపురం మండలాల్లో ప్రతిపాదించిన రహదారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మండలాలు విశాఖ.. విజయనగరం జిల్లాలకు పక్కపక్కనే ఉంటాయి. ఈ మాస్టర్ ప్లాన్ లో చాలా వరకు రోడ్లను గ్రామాల చెరువులు.. సాగు భూములు.. అనుమతులు ఇచ్చిన లేఔట్ల మీదుగా వెళుతుండటం ఇప్పుడు అసలు సమస్య. దీంతో వేలాది మంది ఈ మాస్టర్ ప్లాన్ కు బలయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ముసాయిదాకు సంబంధించి జరుగుతున్న హాట్ హాట్ చర్చల్లో కొన్ని అంశాల మీద పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమవుతోంది. అందులోని కొన్ని అంశాల్ని చూస్తే..

- విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 45గ్రామాలు ఉన్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తే ఇందులో సగానికి పైగా గ్రామాలు ప్రభావితం కావటం ఖాయం. మండలంలోని ప్రతి కిలో మీటరు.. ఒకటిన్నర కిలోమీటర్ల దూరానికి వంద నుంచి రెండు వందల అడుగుల రోడ్లను ప్రతిపాదించారు. అదే జరిగితే.. చాలా గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టం చేయాల్సిందే. కొన్ని చిన్న గ్రామాలు అయితే ఖాళీ చేయాల్సిందే.

- పలు గ్రామాలుగా మీదుగా రోడ్లను ప్రతిపాదించారు. అలాంటి గ్రామాల విషయానికి వస్తే భీమిలి మండలంలోని పలు ఊళ్లు ప్రభావితం కానున్నాయి. అలా దెబ్బ తినే గ్రామాలుగా భావిస్తున్న వాటి జాబితాను చూస్తే..

భీమిలి మండలంలో..
- నిడిగట్టు
- కాపులుప్పాడ
- తాళ్ల వలస
- సంగివలస
- చిట్టివలస
భోగాపురం మండలంలో
- నాతవలస
- యాతపేట
- గూడెపువలస
- గంగువాని పాలెం
- సబ్బన్న పేట
- జగ్గయ్యపేట
- భోగాపురం ఈస్ట్
- భోగాపురం వెస్ట్
- అక్కివరం
- చాకివలస
- ముంజేరు
- దళ్లిపేట
- సవిరవిల్లి
- రాజపులోవ
- పోలుపల్లి
- అమనాం తో పాటు మరిన్ని గ్రామాలు.

భారీగా వేయనున్నట్లుగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ లో చిన్న గ్రామాలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున చెరువులు.. వాగులు ప్రభావితం కానున్నాయి. వాస్తవానికి చెరువుల్ని ధ్వంసం చేసి నిర్మాణాల్ని చేపట్టకూడదు.కానీ.. మాస్టర్ ప్లాన్ లో ఈ విషయాన్ని విస్మరించటం గమనార్హం. సబ్బన్నపేటలో రెండు చెరువులు.. రామచంద్రాపురంలో ఒకటి.. భోగాపురం వద్ద మూడు చెరువుల మీదుగా రోడ్లనుప్రతిపాదించటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

విశాఖ పట్నం - విజయనగరం జిల్లాల నడుమ గోస్తనీ నది సముద్రంలో కలిసే లోపున్న దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో పది రోడ్లు వెళ్లేలా ప్రతిపాదించటంపై విస్మయం వ్యక్తవుతోంది. మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించినట్లుగా రోడ్లను వేసేందుకు ఓకే చెబితే.. భోగాపురం మండలంలో వీఎంఆర్ డీఏ అనుమతించిన ప్రతి లే అవుట్ కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. ఒక్క భోగాపురం మండలంలోనే ఐదు వేల ఎకరాల్లో సుమారు 200 లేఅవుట్లు ఉన్టన్లు చెబుతున్నారు. ఒక్కో లేఅవుట్ 5 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్ చేసి డెవలప్ చేశారు. ఇవి మొత్తం 60 వేల ప్లాట్లు ఉంటే.. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నట్లుగా చేస్తే 30వేల ప్లాట్లు ప్రభావితం కావటం ఖాయమంటున్నారు. ఇలా.. ఇంతటి ప్రభావాన్ని చేపే మాస్టర్ ప్లాన్ 2041 విషయంలో ఏం చేస్తారన్నది ఇప్పుడు అక్కడి వారి గుండెల్లో గుబులు రేపుతోంది.