Begin typing your search above and press return to search.

విశాఖలో ఐపీఎల్ దెబ్బకు వాటర్ ప్రాబ్లం

By:  Tupaki Desk   |   7 May 2016 8:06 AM GMT
విశాఖలో ఐపీఎల్ దెబ్బకు వాటర్ ప్రాబ్లం
X
విశాఖలో జరగనున్న ఐపిఎల్‌ మ్యాచ్‌ లకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఎసిడి-విడిసిఎ మైదానంలో జరగనున్న ఆరు ఐపిఎల్‌ మ్యాచ్‌ లకు కావాల్సిన ఏర్పాట్లును పూర్తి చేశారు. మహారాష్ట్రలో మైదానాలను తడిపేందుకు సరిపడా నీరు లేదన్న కారణంతో విశాఖకు ఆరు మ్యాచ్‌లను తరలించారు. విశాఖలో పిచ్‌ లను తడిపేందుకు సరిపడా నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ ప్రభావం ప్రజలపై పడింది. ఫలితంగా తాగునీటికి వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఈనెల 8 నుంచి 21 వరకూ ఇక్కడ ఆరు మ్యాచ్‌ లు జరగనున్నాయని 18 రోజులు క్రితమే ప్రకటించారు. ఒకరోజు పిచ్‌ ను తడిపేందుకు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రకటించిన నాటి నుంచి ఇంత వరకూ ఈ 18 రోజులూ మైదానాన్ని రోజుకు 60 వేల లీటర్ల నీటిని చొప్పున తడిపేందుకు 10.80 లక్షల లీటర్ల నీరు అవసరమైంది. మామూలు రోజుల్లో తడపాల్సిన అవసరం లేకపోయినా ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో ప్రతిరోజూ తడపాల్సిన పరిస్థితి ఎదురైందని నిర్వాహకులు తెలిపారు. ఈ నీటిని మైదానం నిర్వాహకులు తమ బోర్ల ద్వారా సరఫరా చేసి మైదానాన్ని తడుపుతున్నారు.

రోజూ 60 వేల లీటర్ల నీటిని తోడటం వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజూ మైదానాన్ని తడపడం వల్ల చాలా నీరు ఖర్చయింది. దీంతో చుట్టు ప్రక్కల బోర్లకు - బావులకు వెళ్లాల్సిన నీటిని కూడా ఈ బోర్లే పీల్చేస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం చుట్టుపక్కల బోర్లపై పడడంతో ఆ బోర్లన్నీ మూలకు చేరాయి. బోర్లు మూలకు చేరడంతో మధురవాడ పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. కొండవాలు ప్రాంతాల ప్రజలకు ఈ ఇబ్బందులు మరీ తీవ్రతరమయ్యాయి. వేసవి కాలం కావడం వల్ల తాగునీటి సమస్యలు ఎదురవుతాయని చాలాచోట్ల ముందుగానే సంబంధిత అధికారులు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి బోర్లను బాగుచేయించారు. పది రోజులు క్రితం వరకూ బోర్లన్నీ బాగానే పనిచేశాయి. ఈ మైదానానికి అధిక నీటిని వాడిన తరువాతే సమస్య తలెత్తింది.

మరోవైపు మధురవాడ ప్రాంతాల్లో జివిఎంసి నుంచి సరఫరా చేస్తున్న తాగునీరు అరగంటే ఇస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వేసవి వచ్చింది మొదలు అరగంటే నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో అరగంట నీరిచ్చినా తాగేందుకు ఆ నీటిని పట్టుకుని వాడకానికి బోర్లపై ఆధారపడేవారు. ప్రస్తుతం బోర్లు కూడా పనిచేయక పోవడంతో నీటికి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో ఉండే మోటారు బోర్లు కూడా పూర్తిగా అడుగంటిపోయి బురదనీరు సరఫరా అవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఆ నీరు తాగేందుకు ఉపయోగపడక చాలామంది తాగునీటి క్యాన్లను ఆశ్రయిస్తున్నారు. మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్ లు విశాఖకు తరలించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ, విశాఖ నగరం తాగునీటి కష్టాల్లో చిక్కుకోవడంతో మహారాష్ట్ర ఎందుకు మ్యాచ్ లు వద్దందో తెలిసిందని అంటున్నారు.