Begin typing your search above and press return to search.

విశాఖలో భారతరత్నకే ఇంతటి అవమానమా..!!?

By:  Tupaki Desk   |   12 Aug 2019 9:22 AM GMT
విశాఖలో భారతరత్నకే ఇంతటి అవమానమా..!!?
X
ప్రణబ్ ముఖర్జీ... భారత దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మచ్చ లేని నేత. అంతేనా... దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్న మహోన్నత వ్యక్తి. అంతటి కీలక వ్యక్తికి కనీసం నీళ్లు కూడా అందించలేకపోయారు. కఠినమైన ప్రొటోకాల్ అమలయ్యే ప్రముఖుల జాబితాలో ఉన్న ప్రణబ్ కు అంతటి అవమానం ఎక్కడ జరిగిందనుకుంటున్నారు? ఎక్కడో కాదు... అన్నపూర్ణగా పిలుచుకుంటున్న నవ్యాంధ్రలో. అది కూడా సముద్ర తీరాన సాగర నగరంగా విలసిల్లుతున్న విశాఖ నగర పరిధిలో. అంతేనా... సముద్రం ఒడ్డున ఉండే భారత నావికా దళం ప్రాంతంలో ప్రణబ్ కు ఇంతటి అవమానం జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది.

సరే... అసలేం జరిగిందన్న విషయానికి వస్తే... భారతరత్న పురస్కారం అందుకున్న తర్వాత తొలిసారిగా ఢిల్లీ బయట పర్యటించిన ప్రణబ్... విశాఖలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం గీతం వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. గీతం వర్సిటీ ప్రకటించిన అవార్డును అందుకునేందుకు ఆయన విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో ల్యాండైన ప్రణబ్ కు ప్రొటోకాల్ మేరకు ఘనంగానే స్వాగతం పలికిన అధికారులు... విశాఖ పోర్టు ఆధ్వర్యంలోని గెస్ట్ హౌస్ లో బస చేశారు.

అయితే ప్రణబ్ సదరు గెస్ట్ హౌస్ లో కాలుపెట్టేసరికి అందులో చుక్క నీరు కూడా లేదట. గెస్ట్ హౌస్ పైన ఉన్న ట్యాంక్ లో నీరు లేకపోగా... ట్యాంక్ ను నీటితో నింపేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ పనిచేయడం లేదట. జనరేటర్ వేద్దామన్నా కూడా అది కూడా చెడిపోయిందట. దీంతో ఏకంగా ప్రణబ్ కోసం ఏర్పాటు చేసిన కాన్వాయ్ లో ఉన్న ఫైరింజన్ తో ట్యాంక్ ను నీటితో నింపుదాయని చేసిన యత్నం... ఫైరింజన్ నీటితో స్నానమెలా? అన్న అనుమానాలతో దానిని కూడా ఆపేశారట. మరి గెస్ట్ గా వచ్చిన ప్రణబ్ స్నానం ఎలా? అప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బకెట్లతో నీటిని పైకి పంపారట.

ఇంత జరిగినా ప్రణబ్ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఏ అధికారిని నీలదీయలేదు. తన పర్యటనను ముగించుకుని ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రణబ్ వెళ్లిన తర్వాత కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రణబ్ కు బస ఏర్పాటు చేసిన పోర్టు అధికారులు ఇప్పుడు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారట. ఇంత జరుగుతున్నా పై అధికారులకు సమాచారం చేరవేయకుండా కింది స్థాయి అధికారులపై చిందులు తొక్కుతూ హల్ చేసిన ఓ అధికారిపై వేటు పడే దిశగా పోర్టు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం.