Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు ఉద్యమం : 30న అటో ఇటో తేలిపోవాల్సిందే...!

By:  Tupaki Desk   |   14 Jan 2023 4:41 PM GMT
విశాఖ ఉక్కు ఉద్యమం : 30న అటో ఇటో తేలిపోవాల్సిందే...!
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఇప్పటి ఆరు దశాబ్దాల క్రితం సాగిన పోరాటం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అటువంటి పోరాటం మళ్లీ జరగలేదు అన్నట్లుగా సాగింది. తమ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కోసం పరిశ్రమ కోసం నాటి యువత తృణ ప్రాయంగా తనువులు చాలించారు.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు మహిళ. ఆమె ఒక మాట అంటే వెనక్కి తగ్గే రకం కాదు. పైగా దేశమంతా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న రోజులు అవి. ఎక్కడో బీహార్ కో మరో రాష్ట్రానికే ఉక్కు పరిశ్రమను కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడడం అంటే అది ఆసాధ్యమే. కానీ నాడు ఉన్నది ఉక్కు సంకల్పం. అందుకే తెన్నేటి విశ్వనాధం వంటి మహానుభావులతో పాటు ఎంతో మంది యోధానుయోధులు ఉక్కు కోసం పోరాడారు. గుంటూరు జిల్లాకు చెందిన అమృతరావు అమరణ దీక్ష పోరాటం ఢిల్లీని గడగడలాడించింది. ఏకంగా 30 మందికి పైగా యువకులు నాడు ఆత్మ బలిదానం చేశారు. అంతా అట్టుడికిపోయింది.

అలా విశాఖ ఉక్కు అయిదేళ్ళ పోరాటం తరువాత వచ్చింది. మరి అలా సాధించుకున్న ఉక్కు పరిశ్రమ కళ్ల ముందు ఉన్నా కూడా దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నా రాజకీయ నాయకత్వం కిమ్మనదు, జనంలో సైతం కళ్ల ముందు ఉన్నది జాతీయ సంపద రేపు ఒక జాతి సంపదగా మారినా తమకేంటి అన్న నిర్లిప్తత కనిపించడమే అసలైన విషాదం. 2021 జనవరి 28న కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయనున్నట్లుగా ప్రకటించింది.

దాంతో అగ్గి రాజుకుంది. అది ఆరకుండా కాపాడుతున్నది విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు మాత్రమే. ఈ నెల 30కి 701 రోజులుగా నిరాటకంగా విశాఖ ఉక్కు ఉద్యమం సాగుతోంది. ఈ మధ్యలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చారు. జాతీయ నాయకులు సైతం విశాఖ వచ్చి సంఘీభావం తెలిపారు. అయినా సరే కేంద్రం ససేమిరా అంటోంది. దాంతో ప్రైవేట్ కి వేగంగా అడుగులు పడుతున్నాయి.

కొత్త ఏడాది తొలినాళ్ళలో విశాఖ ఉక్కు వేటుకు అధికారికంగా ముహూర్తం పెట్టారని వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ నెల 30న భారీ ఎత్తున ఉద్యమం చేపట్టడానికి ఉక్కు కార్మిక సంఘాలు నిర్ణయించాలి. ఆ రోజున ఉక్కు మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అంతే కాదు అధికార విపక్ష నేతలను కూడా పిలుస్తారు అని అంటున్నారు. అందరినీ ఒక చోట చేర్చి ఉక్కుని కాపాడుకునే కార్యాచరణను సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అదే టైం లో విశాఖకు సీఎం జగన్ రానున్నారు అని అంటున్నారు. మరి ఆయనకు కూడా ఈ మొర మరోసారి వినిపిస్తారు అని తెలుస్తోంది.

ఈ మధ్యనే రణస్థలం సభలో పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా చూడమని కేంద్రాన్ని కోరుతాను అని చెప్పారు. దాంతో మిగిలిన పార్టీలు కూడా గట్టిగా స్పందిస్తే కేంద్రం స్టాండ్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి. విశాఖ ఉక్కు పోరాటం కీలక దశకు చేరుకుందని తాడో పేడో అటో ఇటో అని ఉద్యమకారులు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.