Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు లేఖరాసి నిరుద్యోగి సూసైడ్

By:  Tupaki Desk   |   18 April 2017 11:23 AM GMT
చంద్రబాబుకు లేఖరాసి నిరుద్యోగి సూసైడ్
X
ఎన్నికలకు ముందు చంద్రబాబు - టీడీపీ నేతలు ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారంచేశారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత రిక్రూట్ మెంట్లే లేవు. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు విభజన నేపథ్యంలో కనీసం విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నా కాసిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ, అదీ జరగకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగులు దుర్భర స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి ఈ పరిణామాలన్నీ వివరిస్తూ చంద్రబాబుకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

విశాఖకు చెందిన పితాని శివదుర్గా ప్రసాద్ (33) అనే నిరుద్యోగి ఇంజినీరింగ్ చదివాడు. ఈ నెల 7న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ సిటీలోని మర్రిపాలెం వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదువు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం మాత్రం దొరకలేదు. రెండేళ్ల క్రితం అతనికి పెళ్లయింది. కుటుంబాన్ని పోషించేందుకు చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు.

ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. తాను చదువుకున్నా ఉద్యోగం రాలేదని... దీంతో తన భార్య కూడా తనను వదిలి వెళ్లిపోయిందని లేఖలో ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన యువకులు ఉపాధి దొరకక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని చెప్పాడు. అందరికీ ఉపాధి దొరకాలని... తనలా ఎవరూ చనిపోకూడదని రాశాడు. విశాఖ రైల్వే జోన్ కోసం అందరూ పోరాడాలని తెలిపాడు. రైల్వే జోన్ రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లేఖలో రాశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/