Begin typing your search above and press return to search.

అయ్యో ఏయూ.. ఏం జ‌రుగుతుంద‌క్క‌డ ?

By:  Tupaki Desk   |   27 May 2022 3:30 PM GMT
అయ్యో ఏయూ.. ఏం జ‌రుగుతుంద‌క్క‌డ ?
X
ప్ర‌తిష్టాత్మ‌క విశాఖ ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో వివాదాల చీక‌టి అలుముకుంది. ఈ చీక‌టి తొల‌గించేదెవ‌రు. అసాంఘిక శ‌క్తుల కార‌ణంగా నెల‌కొన్న చీక‌టిని తొల‌గించేదెవ‌రు? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా అక్క‌డ కొన్ని రోజులుగా ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణాన వ్య‌భిచారం జ‌రుగుతుంద‌న్న వార్త‌లు వెలుగు చూశాయి. నిర్ఘాంత పోయే విధంగా అక్క‌డి ప‌రిస‌రాలు కూడా ఉన్నాయి.

మ‌రి! అధికారులు ఏం చేస్తున్నారు.. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్నారా ? లేదా అస‌లు నిఘా వ్య‌వ‌స్థ అన్న‌ది ఇక్క‌డ లేకుండా పోయిందా..? ప‌విత్ర విద్యాల‌య ప్రాంగ‌ణంలో మందు సీసాలు, కండోమ్ ప్యాకెట్లు ల‌భ్యం అయ్యాయి. ఇంకా డ్ర‌గ్ వినియోగం.. వ్య‌భిచారం ఇవ‌న్నీ కూడా య‌థేచ్ఛ‌గా సాగిపోతున్నాయి. ఇన్ని అసాంఘిక చ‌ర్య‌లు జ‌రుగుతున్నా కూడా పోలీసులు ఇటుగా రాక‌పోవ‌డం, ముఖ్యంగా ఇక్క‌డ చెట్ల‌పై మంచాలు మాదిరిగా ఏర్పాటుచేసుకుని, వాటిపై ప‌రుపులు వేసుకుని వ్య‌భిచారం సాగిస్తున్న యువ‌త‌ను ప‌ట్టుకోక‌పోవ‌డం అన్న‌ది నిజంగానే ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

వాస్తవానికి ఎప్ప‌టి నుంచో ఇక్క‌డ హాస్ట‌ళ్ల‌పై ప‌లు అభియోగాలు లేదా ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. చీక‌టి ప‌డితే చాలు అటుగా వెళ్లేందుకు ఏయూలో చ‌దువుకునే విద్యార్థులే హ‌డ‌లి పోతుంటారు. ముఖ్యంగా లైబ్ర‌రీ ప్రాంగ‌ణాన కూడా ఇటువంటి వాతావ‌ర‌ణ‌మే ఉండేది. సువిశాల ప్రాంగ‌ణం కావ‌డం, ఎక్క‌డిక‌క్క‌డ నియంత్రిత వ్య‌వ‌స్థ‌లు లేక‌పోవడం భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలు కొట్టొచ్చిన విధంగా క‌నిపిస్తున్నాయి.

ముఖ్యంగా హాస్ట‌ళ్ల‌కు సంబంధించి ఇక్క‌డి విద్యార్థుల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో సంబంధిత వార్డెన్లు స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం, వీళ్లు కూడా కొన్ని సంద‌ర్భాల్లో డ‌బ్బుల‌కు అల‌వాటు ప‌డిపోయి చూసీ చూడ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వగైరా వ‌గైరా ఆరోప‌ణ‌లు అయితే ఉన్నాయి. అయితే వీటిపై ఎప్పుడూ వ‌ర్శిటీ అధికారులు పెద్ద‌గా దృష్టి సారించిన దాఖ‌లాలు లేవు.

నిఘా పెంచాల్సిందే..తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌ర్శిటీ అధికారుల అప్ర‌మ‌త్తం అయ్యారు అని, అన్ని హాస్ట‌ళ్ల ప్రాంగ‌ణాల్లో నెల‌కొన్న పొద‌ల‌ను తొల‌గించి, ప‌రిస‌రాలు శుభ్రం చేయించి, నిఘాను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌త‌క ఎంతైనా ఉంది.

అసాంఘిక శ‌క్తుల రాక‌ను క‌ట్టడి చేయడంలో విద్యార్థుల‌కే కాదు విద్యార్థి సంఘాలకూ బాధ్య‌త ఉంది. ఇక్క‌డ జ‌రుగుతున్న డ్ర‌గ్ వినియోగంపై కూడా పోలీసులు నిఘా పెంచి, వాటిని క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ ఇక్క‌డ అంతటి స్థాయి మార్పులు ఇప్ప‌టికిప్పుడు సాధ్య‌మా ? అస‌లే యూనివ‌ర్శిటీ అధికార పార్టీ నీడ‌లో ఉంది. క‌నుక మార్పు దిశ‌గా ఏం జ‌రుగుతుందో అన్న‌ది కాస్త సంశ‌యాత్మ‌కమే !