Begin typing your search above and press return to search.

ఆరు నూరు అయినా విశాఖలోనే మకాం...?

By:  Tupaki Desk   |   17 Feb 2022 2:30 AM GMT
ఆరు నూరు అయినా విశాఖలోనే మకాం...?
X
విశాఖ అంటే జగన్ కి మోజు. విశాఖ గురించి ఈ మధ్య జరిగిన సినీ ప్రముఖుల భేటీలో జగన్ చెప్పిన విషయాలు గమనిస్తే అందరికీ అర్ధమవుతుంది. విశాఖను ఏపీకి గ్రోత్ ఇంజన్ గా ఆయన భావిస్తున్నారు. మనకు ఉన్నది విశాఖ ఒక్కటే. దాన్ని మనమంతా సొంతం చేసుకోవాలి.

ఈ రోజు నుంచి అక్కడకు అందరం వెళ్ళి కలసికట్టుగా పని మొదలుపెడితే మరో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో విశాఖ హైదరాబాద్ కి ధీటుగా ఎదుగుతుంది అని జగన్ సినీ ప్రముఖులకు చెప్పుకొచ్చారు.

మరి వారిని విశాఖ రమ్మని పిలిచిన జగన్ తాను మాత్రం తాడేపల్లిలోనే అలా ఉంటారా. అందుకే ఆయన వడి వడిగా విశాఖ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఆయన తమ మకాం ని విశాఖ మార్చడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకుంటున్నారు. ఉగాది తరువాత ఏ క్షణమైనా జగన్ విశాఖ వెళ్ళేందుకు రెడీ అన్నది గట్టిగా సాగుతున్న ప్రచారం.

విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని పాలించాలి అన్నది జగన్ కోరిక. దాని కోసం ఆయన మరోసారి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని తెస్తారు. ఒక వేళ దాని మీద కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే మాత్రం జగన్ ఈసారి తాడేపల్లిలో ఉండేందుకు అసలు ఇష్టపడరని అంటున్నారు. ఆయన ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నే విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే పరిపాలన చేస్తారు అంటున్నారు.

అంటే ఉగాది తరువాత ఏపీలో చాలా పెద్ద మార్పులే వస్తాయని అంటున్నారు. కొత్త జిల్లాలతో పాటు, మూడు రాజధానులు, అలాగే కొత్తగా మంత్రులు, వాటితో పాటే ముఖ్యమంత్రి విశాఖ మకాం వంటివి ఉంటాయని తెలుస్తోంది.

మరి విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం ఇప్పటికే రెండు మూడు భవనాలను పరిశీలించారు. అందులో ఒకదాన్ని ఎంచుకుని జగన్ తాడేపల్లి టూ విశాఖకు మకాం మార్చేయడమే మిగిలి ఉంది అంటున్నారు.