Begin typing your search above and press return to search.

విశాఖ రాజ‌ధాని స‌రే.. వీటి సంగ‌తే అంతుచిక్క‌డం లేదుగా!!

By:  Tupaki Desk   |   16 Oct 2022 1:30 PM GMT
విశాఖ రాజ‌ధాని స‌రే.. వీటి సంగ‌తే  అంతుచిక్క‌డం లేదుగా!!
X
``విశాఖ గురించి మాట్లాడాలంటే.. అక్క‌డ రాజ‌ధానిని ఏర్పాటు చేయాలి. అప్పుడే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెందుతుంది!`` ఇదీ.. వైసీపీ మంత్రులు,, నాయ‌కులు చెబుతున్న మాట‌. స‌రే.. మంచిదే.. అనుకుందాం. రాజ‌ధాని కాక‌పోతే.. అభివృద్ధి చెంద‌దా.. చేయ‌రా.. అనే విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. అస‌లు.. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌డం అనే విష‌యాన్ని కొంచెం సేపు ప‌క్క‌న‌పెడితే.. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నవారు.. చేసిన వారు.. లేదా.. చేస్తామ‌ని చెబుతున్న‌వారు.. విశాఖ‌కు రావాల్సిన‌.. ఉన్న‌వి పోకుండా చూడాల్సిన బాధ్య‌త లేదా.. అనే ప్ర‌శ్న‌లు విశాఖ ప్ర‌జ‌ల నుంచి బ‌లంగానే వినిపిస్తున్నాయి. కీక‌ల‌మైన మూడు విష‌యాల‌ను వారు ప్ర‌స్తావిస్తున్నారు.

ఒక‌టి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌. దీనికి కేంద్రం ఇప్ప‌టికే తాంబూలాలిచ్చేశాం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మరోవైపు.. అబ్బెబ్బే.. మా త‌ప్పు లేదు.. అలా చేయొద్ద‌ని.. మేం కేంద్రానికి లేఖ‌లు రాశాం.. త‌రచుగా.. పార్ల‌మెంటులోనూ.. ప్ర‌స్తావిస్తున్నాం.. అని అధికార పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు గ‌ర్జ‌న చేసిన‌ట్టుగా.. స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు గ‌ర్జించ‌లేక పోతున్నార‌నేది సామాన్యుల ప్ర‌శ్న‌. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు ధార‌ద‌త్తం అయిపోతున్నా.. లేఖ‌ల‌తో స‌రిపుచ్చుకున్న‌.. పెద్ద‌లు.. ఇప్పుడు ఎందుకు అంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నార‌నేది ప్రశ్న‌.

రెండు.. విశాఖ రైల్వే జోన్‌. ఇది రాష్ట్ర పున‌ర్‌విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చిన కీల‌క అంశం. దీనిపై ఎనిమిదేళ్ల‌యినా.. కేంద్రం నుంచి ఎలాంటి ఉలుకు ప‌లుకు ఉండ‌డం లేదు. పైగా.. దోబూచులాడుతున్న ప‌రిస్థితి ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ, తెలంగాణ‌లతో కేంద్రం చేసిన చ‌ర్చ‌ల్లోనే తేట‌తెల్లం అయింది. రైల్వే శాఖ అస‌లు విశాఖ‌లో జోన్ పెట్ట‌డం కుద‌ర‌ద‌ని అంటే.. కేంద్రం మాత్రం ప‌రిశీలిస్తున్నాం.. అంది. మ‌రి దీనిపై వైసీపీ కానీ, ప్ర‌తిప‌క్ష నేత‌లు కానీ.. ఏం చేశారు? దీనిపై ఎందుకు గ‌ర్జ‌న లు నిర్వ‌హించ‌లేదు. స‌ద‌స్సు పెట్ట‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసి.. కేంద్రంపై పోరుకు ఎందుకు రెడీ కావ‌డం లేదు? ఇది వ‌స్తే.. విశాఖ అభివృద్ధి చెందిన‌ట్టుకాదా.. పొరుగున ఉన్న శ్రీకాకుళం, విజ‌య‌నగరం ప్రాంతాల‌కు ఫ‌లితం ఉండ‌దా? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌.

మూడు.. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం. దీనికి కూడా విబ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న విశాఖ విమానాశ్ర‌యాన్ని మ‌రింత మెరుగు పరిచి అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దాల‌ని అనుకున్నారు. కానీ, ఇంత వ‌రకు అతీగ‌తీ లేదు. ఇది వ‌స్తే.. స‌మీప‌ప్రాంతాల్లో ర‌హ‌దారి వ్య‌వ‌స్థ మెరుగు ప‌డుతుంది. అదేవిధంగా.. ర‌వాణా సౌల‌భ్యం పెరిగి.. స్థానికంగా.. ఉపాధి పెరుగుతుంది. ఉద్యోగాలు వ‌స్తాయి. సంస్థ‌లు పెరుగుతాయి. మ‌రి దీనిపై ఎందుకు గ‌ర్జించ‌డం లేదు? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. కేవలం రాజ‌ధాని వ‌స్తేనే డెవ‌ల‌ప్‌మెంట్ ఉంటుందా? అనేది వీరి ప్ర‌శ్న‌. మ‌రిదీనికి అధికార పార్టీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షాలు ఏం చెబుతాయో చూడాలి.