Begin typing your search above and press return to search.

అధికారుల‌కు త‌ల‌నొప్పిగా చెత్త ప‌న్ను!

By:  Tupaki Desk   |   23 Feb 2022 1:30 PM GMT
అధికారుల‌కు త‌ల‌నొప్పిగా చెత్త ప‌న్ను!
X
అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రావ‌నికి కొత్త‌గా ప‌న్నులు వ‌సూలు త‌ప్ప మ‌రోమార్గం ఏమీ కనిపించ‌డం లేదు.ఓ లెక్క ప్ర‌కారం ఇప్ప‌టిదాకా రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పు చేసింద‌ని టీడీపీ అంటోంది.వీటికి ప్ర‌త్యామ్నాయంగా ఆదాయం పెంచుకునేందుకు ప‌న్నుల పెంపు మ‌రియు వ‌సూలు అన్న‌ది ఓ ప్ర‌ధాన వ‌నరుగా మార‌నుంది.

ఇప్ప‌టికే ఓటీఎస్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయ‌లు తేవాల‌నుకున్నారు కానీ రాలేదు. చెత్త ప‌న్ను ద్వారా కూడా నిర్దేశిత మొత్తాలు సేక‌రించి,పారిశుద్ధ్య ప‌నుల నిర్వ‌హ‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని భావించారు. కానీ పంచాయ‌తీల్లో చెత్త త‌ర‌లింపు కానీ లేదా వీధుల శుభ్ర‌త కానీ స‌రిగా లేక‌పోవ‌డంతో స్థానికంగా వ‌స్తున్న నిర‌స‌న‌ను ప్ర‌భుత్వం ఎదుర్కోలేక‌పోతోంది.ఈ త‌రుణంలో త‌రుచూ వాగ్వాదాలు నెలకొంటున్నాయి.

ఫ‌లితంగా ప‌న్నుల వ‌సూలు అన్న‌ది కొన్ని చోట్ల త‌ల‌కు మించిన భారంగానే ఉంది. ఓ వైపు నీటి తీరువా వ‌సూలు కాక సంబంధిత అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లు చెత్త ప‌న్ను వ‌సూలు కూడా పెద్ద త‌ల‌నొప్పిగా ఉంది.

ప‌న్నుల వ‌సూలు కాక అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌లేక‌పోతున్నామ‌ని యంత్రాంగం చెబుతుంటే, ఇప్పుడున్న స్థితిలో తాము పెంచిన ప‌న్నుల‌ను కానీ కొత్త‌గా విధించిన ప‌న్నులు కానీ చెల్లించ‌లేమ‌ని ప్ర‌జ‌లు చేతులెత్తేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో... విశాఖ తీరంలో మ‌రోవివాదం నెల‌కొని ఉంది. ఇక్క‌డ చెత్త ప‌న్ను వ‌సూలు అన్న‌ది అధికారుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఎంవీపీ కాల‌నీలో చెత్త ప‌న్ను వ‌సూలుకు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వెళ్లిన అధికారుల‌కు స్థానిక మ‌హిళ‌లు చుక్క‌లు చూపించారు.

తాము ఇప్ప‌టికే పెంచిన ఇంటి ప‌న్ను, కుళాయి ప‌న్ను చెల్లిస్తున్నామ‌ని ఇవి కాకుండా చెత్త ప‌న్ను చెల్లించ‌మంటే త‌మ‌వ‌ల్ల కాద‌ని, తామంతా కూలి చేసుకుంటూ కుటుంబాల‌ను పోషించుకుంటున్నామ‌ని చెబుతూ మ‌హిళలంతా తిరుగుబాటు చేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.