Begin typing your search above and press return to search.

విశాఖ.. బ్యాడ్ లక్ కంటిన్యూ... ?

By:  Tupaki Desk   |   23 Nov 2021 2:30 PM GMT
విశాఖ.. బ్యాడ్ లక్ కంటిన్యూ... ?
X
విశాఖపట్నం అంటే గొప్ప నగరం అని అంతా చెబుతారు. అది నిజం కూడా. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు. విశాఖ రావాలనుకునే వారు ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచం నలుమూలలా కూడా పెద్ద ఎత్తున ఉంటారు. విశాఖలో ప్రకృతి రమణీయత ఉంది. విశాఖను సిటీ ఆఫ్ బ్యూటీ అని కూడా అభివర్ణించవచ్చు.

అలాంటి విశాఖ ఇప్పటికి 120 ఏళ్ల క్రితమే అతి పెద్ద జిల్లాగా ఉంది. బ్రిటిష్ వారు, డచ్చి వారు విశాఖను అద్భుతంగా ఆ రోజులలోనే అభివృద్ధి చేశారు. ఆ తరువాత స్వతంత్ర భారతదేశంలో విశాఖ‌లో జరిగిన ఏ అభివృద్ధి కూడా తనకు తానుగా వచ్చిందే తప్ప విశాఖ జనాల పోరాటాల వల్ల కాదు, అయితే ఇందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే మినహాయింపు. అలాంటి విశాఖకు అన్నీ ఉన్నా అయిదవతనమే కరవు అంటారు.

అది ప్రతీ సారీ నిజమూ రుజువూ అవుతూ వస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా ఉద్యమం పీక్ స్టేజిలో ఉన్న నాడు విడిపోయిన ఏపీకి విశాఖే రాజధాని అని అంతా అనేవారు. నాడు తెలంగాణా ఉద్యమకారులు సైతం మీరు విడిపోతే హైదరాబాద్ తో సరిసమానం అయిన సిటీగా విశాఖ ఉంది కదా అంటూ చెప్పుకుంటూ వచ్చారు.

ఏపీ జనాల్లో కూడా విశాఖ మాత్రమే హైదరాబాద్ కి సాటి అన్న భావన ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రా రాష్ట్రంగా 1953లో ఏర్పడిన నేపధ్యంలో కర్నూల్ తొలి రాజధానిగా ఉండేది.

ఆనాడు కూడా కర్నూల్ లో సదుపాయాలు తక్కువగా ఉండడంతో విశాఖను రాజధాని చేయాలన్న డిమాండ్ వినిపించేది. ఇక తొలి సీఎం ప్రకాశం విశాఖలో అప్పట్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. అలా నాడు తెలంగాణాతో కనుక ఆంధ్రా కలవకపోతే విశాఖ రాజధాని అయ్యేది.

అయితే 1956లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంతో విశాఖకు రాజధాని హోదా తప్పిపోయింది. ఇక చంద్రబాబు విభజన ఏపీకి తొలి సీఎం గా 2014లో అయ్యారు. ఆయన తొలి మంత్రివర్గ సమావేశాన్ని విశాఖలో నిర్వహించారు. దాంతో విశాఖ రాజధాని అవుతుందని అందరిలో ఆశలు చిగురించాయి. అయితే చివరికి అమరావతి రాజధానిగా ప్రకటన వచ్చింది.

ఆ తరువాత 2019లో అధికారంలోకి వైసీపీ రావడంతో జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని బయటకు తీశారు. అలా విశాఖకు పరిపాలనా రాజధానిని చేస్తామని ప్రకటించారు. ఇవాళా రేపూ అంటూ రెండేళ్ల పాటు వైసీపీ నేతలు తెగ ఊదరగొట్టారు.

రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా భూముల రేట్లు ఆకాశానికి అంటాయి. అంతే కాదు, విశాఖ మీద ఫోకస్ కూడా పూర్తిగా పెరిగింది. ఈ నేపధ్యంలో ఎంత కాదనుకున్నా జీవీఎంసీ ఎన్నికలే కాదు, స్థానిక ఎన్నికల మీద కూడా రాజధాని ప్రకటన ప్రభావం బాగానే పనిచేసింది. అన్ని చోట్లా వైసీపీ నెగ్గింది. ఇపుడు చూస్తే సడెన్ గా మూడు రాజధానుల చట్టాన్ని వైసీపీ సర్కార్ రద్దు చేసింది.

దాంతో విశాఖకు ఇక రాజధాని రాదా, ఆ హోదా ఉండదా అన్న చర్చ అయితే స్థానికంగా వస్తోంది. విశాఖ విషయంలో ఏం చేస్తారో చెప్పాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. అమరావతి రైతుల పాదయాత్ర పూర్తి అయిన తరువాత విపక్షాలు విశాఖ అభివృద్ధి అంశాన్ని టేకప్ చేసి జగన్ సర్కార్ మీద వత్తిడి పెంచే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ ఊరించి చివరికి విశాఖను అలా వదిలేసిందా అన్న చర్చ అయితే అంతటా ఉంది. దీనికి సరైన సమాధానం వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులే చెప్పాలని అంటున్నారు.