Begin typing your search above and press return to search.

అమ్మ సమాధి సాక్షిగా విశాల్ నామినేష‌న్‌

By:  Tupaki Desk   |   4 Dec 2017 11:10 AM GMT
అమ్మ సమాధి సాక్షిగా విశాల్ నామినేష‌న్‌
X
ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు మీడియా ద్వారా ప్రకటించిన ప్ర‌ముఖ సినీన‌టుడు, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు దివంగ‌త సీఎం జ‌య‌లలిత స‌మాధి వ‌ద్ద‌కు విశాల్ వెళ్లారు. జ‌య స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం విశాల్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కామరాజు, ఎంజీఆర్‌లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలాఉండ‌గా...స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న విశాల్‌కు గ‌ట్టిపోటీ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అన్నాడీఎంకే అభ్యర్థిగా మదుసూదనన్ - డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్ - అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున)‌, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న సంద‌ర్భంగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని విశాల్ వెల్ల‌డించారు. కాగా, నామినేష‌న్ సంద‌ర్భంగా ఒకింత ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. విశాల్ వ‌లే ప‌లువురు అభ్య‌ర్థులు కూడా స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే వారి నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు భ‌ద్ర‌తా సిబ్బంది స‌హ‌కరించ‌క‌పోవ‌డం వారు అధికారుల‌పై మండిప‌డ్డారు. విశాల్ కోసం ఎదురుచూసే అవ‌స‌రం లేదంటూ వారు తోసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా..పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ల్ప ఉద్రిక్తత నెల‌కొంది. కాగా, దీంతో విశాల్ పోటీ వెనుక అన్నాడీఎంకేలోని ఓ వర్గం హస్తం ఉండి ఉండవచ్చున్న సందేహం మొద‌ల‌యింది. అయితే దీన్ని విశాల్ స‌న్నిహితులు త‌ప్పుప‌ట్టారు. తమిళనాడు రాష్ట్రానికి సేవల చేసిన నాయకుల ఆశీర్వాదం కోసం మాత్రమే అతను వెళ్లాడని, అందులో ఎలాంటి తప్పు లేదా, ఎలాంటి రాజకీయ కోణం దాగి లేదని చెబుతున్నారు.

కాగా, సినీరంగంలోని అవినీతిని విశాల్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. మెర్సెల్ సినిమా వివాద సమయంలో బీజేపీ నాయకుడు హెచ్. రాజాను కూడా విమర్శించారు. నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్య కేసు విషయంలో కూడా ఎమ్మెల్యేగానీ ఎంపీగానీ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సామాజిక అంశాల పట్ల తక్షణం స్పందించే నటులలో ఒకడు విశాల్. తమిళనాట జల్లికట్టు నుంచి మొదలు పెడితే మెర్సెల్ వరకు ఎన్నో అంశాల్లో విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. హీరోగానే కాకుండా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సినీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఈ నెల 21న ఆర్కేన‌గ‌ర్ లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం కార‌ణంగా ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.