Begin typing your search above and press return to search.

విశాల్.. బీజేపీకి ముడిపెట్టేశాడే

By:  Tupaki Desk   |   23 May 2018 12:50 PM GMT
విశాల్.. బీజేపీకి ముడిపెట్టేశాడే
X
తమిళనాడులోని తూత్తుకుడిలో ‘స్టెరిలైట్’ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న జనాలపై కాల్పులు జరపడం.. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో తమిళనాడు అట్టుడికిపోతోంది. సినీ ప్రముఖులు చాలామంది ఈ ఘటనను ఖండించారు. ఐతే హీరో విశాల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. స్థానిక ప్రభుత్వాన్ని ఒక్క మాట అనుకుండా విశాల్ పూర్తిగా మోడీ సర్కారు మీదే పడ్డాడు. 2019 ఎన్నికలొస్తున్నాయి జాగ్రత్త అంటూ మోడీకే హెచ్చరిక జారీ చేశాడు విశాల్.

ఈ ఆందోళన జరిగిందిన ఒక సామాజిక అంశానికి సంబంధించి అని.. వ్యక్తిగత లక్ష్యాల కోసం అని.. ‘స్టెరిలైట్’కు వ్యతిరేకంగా 50 వేలమంది ఆందోళన బాట పట్టారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవాలని విశాల్ అన్నాడు. ‘‘ప్రియమైన ప్రధానీ.. మీరు ఇప్పటికైనా మౌనం వీడండి. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి అని మీ భారతీయ జనతా పార్టీనే చెబుతోంది. మరి ఆ పనిని ప్రజలు ఎందుకు చేయకూడదు? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. మరెందుకో కాదు. దయచేసి 2019లో జాగ్రత్తగా ఉండండి’’ అని విశాల్ పేర్కొన్నాడు. ఐతే ఆందోళనకారులపై కాల్పులు జరిపింది స్థానిక పోలీసులైతే.. దీనికి మోడీకి ముడిపెట్టడం ఏంటంటూ విశాల్ మీద సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్న విశాల్.. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి కేవలం బీజేపీనే టార్గెట్ చేయడంలో విశాల్ ఉద్దేశం ఏమనుకోవాలి?