Begin typing your search above and press return to search.

ఆర్కేనగర్‌ కు మళ్లీ ఆయనొచ్చాడు..

By:  Tupaki Desk   |   9 Dec 2017 5:29 PM GMT
ఆర్కేనగర్‌ కు మళ్లీ ఆయనొచ్చాడు..
X
అమ్మ నియోజకవర్గం ఆర్కే నగర్‌కు జరగాల్సిన ఉప ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గతంలో ఇక్కడ ఎన్నికే రద్దయింది... అప్పుడు పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీ చేశారని ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ కంప్లయింట్ చేయడంతో ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే.. తాజాగానూ నటుడు విశాల్ నామినేషన్ విషయంలో మరోసారి ఇక్కడ వివాదమేర్పడింది. దీంతో ఇప్పుడున్న రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని తప్పించి ఆయన స్థానంలో మళ్లీ ప్రవీణ్ నాయర్‌ను భారత ఎన్నికల సంఘం పంపించింది.

హీరో విశాల్‌ నామినేషన్‌ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ వేలుస్వామిని తప్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. హీరో విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని విధుల నుంచి తప్పించింది. హీరో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణపై డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్‌ ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే పార్టీతో కుమ్మక్కు అయ్యిందని స్టాలిన్ ఆరోపించారు.

దీంతో ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది. తక్షణ చర్యల్లో భాగంగా వేలుస్వామిపై వేటు వేసి ఆయన స్థానంలో ప్రవీణ్ నాయర్ ను నియమించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇక్కడ ఎన్నికలకు ప్రయత్నించిన సమయంలో నాయర్ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. ఆయన చాలా స్ట్రిక్టుగా వ్యవహరించడంతో పార్టీల ఆటలు సాగలేదు. మద్యం, మనీ ప్రవాహంపై ఆయన ఇచ్చిన రిపోర్టు దెబ్బకు ఉప ఎన్నికలు రద్దయ్యాయి. ఇప్పడు మళ్లీ ఆయన రావడంతో పాలక అన్నాడీఎంకే టెన్షన్ పడుతోంది.