Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ లో సంచ‌ల‌నం.. సిక్కా ఔట్‌!

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:32 AM GMT
ఇన్ఫోసిస్ లో సంచ‌ల‌నం.. సిక్కా ఔట్‌!
X
వేలాది మంది ఉద్యోగుల‌తో దేశంలోనే రెండో అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కంపెనీకి సీఈవో.. ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న విశాల్ సిక్కా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా.. కీల‌క‌మైన బోర్డు స‌మావేశానికి ముందు సిక్కా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

వాటాదారుల నుంచి షేర్ల‌ను తిరిగి కొనుగోలు చేసే ప్ర‌తిపాద‌న‌పై నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఒక రోజు ముందుగా త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టం విశేషం. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్లు ఆమోదించిన‌ట్లుగా అన్ని స్టాక్ ఎక్చ్సేంజీల‌కు ఇన్ఫోసిస్ స‌మాచారం అందించిది. సిక్కా స్థానంలో తాత్కాలిక ఎండీ.. సీఈవోగా యూబీ ప్ర‌వీణ్ రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇటీవ‌ల కాలంలో ఇన్ఫోసిస్ యాజ‌మాన్యంపై ఎన్ ఆర్ నారాయ‌ణ‌మూర్తితో స‌హా కొంద‌రు ప్ర‌మోట‌ర్లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. సిక్కాతో పాటు కొంద‌రు టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేత‌న ప్యాకేజీల‌ను భారీగా పెంచ‌టం.. కంపెనీని వ‌దిలి వెళ్లిపోయిన కొంద‌రు ఎగ్జిక్యూటివ్‌ల‌కు భారీ మొత్తంలో వీడ్కోల్ ప్యాకేజీ ఇవ్వ‌టాన్ని ప్ర‌మోట‌ర్లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

కంపెనీలో ప‌రిపాల‌నా తీరు స‌రిగా లేద‌న్న విమ‌ర్శ‌ల‌తో పాటు.. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో.. సిక్కా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇన్ఫోసిస్ లోకి నారాయ‌ణ‌మూర్తి మ‌ళ్లీ అడుగు పెట్ట‌నున్న‌ట్లుగా ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. నారాయ‌ణ‌మూర్తి కానీ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని భావిస్తే అందుకు బోర్డు సానుకూలంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. విభేదాల‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు సిక్కా త‌న రాజీనామా ప‌త్రంలో పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది.