Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికే కాదు..నాల‌క్ష్యం మ‌రింత పెద్దదిఃవిశాల్‌

By:  Tupaki Desk   |   4 Dec 2017 3:33 PM GMT
ఉప ఎన్నికే కాదు..నాల‌క్ష్యం మ‌రింత పెద్దదిఃవిశాల్‌
X
విశాల్...త‌మిళ తెర‌పై అనూహ్య రీతిలో ఎదిగిన స్టార్‌. న‌డిగ‌ర్ సంఘంలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ త‌మిళ సినీరంగంలోని అంశాల‌పై ఆయ‌న స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. సామాజిక అంశాల‌పై స్పందించే విశాల్ అనూహ్య రీతిలో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌ బ‌రిలో దిగారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు దివంగ‌త సీఎం జ‌య‌లలిత స‌మాధి వ‌ద్ద‌కు విశాల్ వెళ్లారు. జ‌య స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం విశాల్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై - కామరాజు - ఎంజీఆర్‌ లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను విశాల్ పంచుకున్నారు.

ఆర్కే న‌గ‌ర్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు - అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని నియోజ‌క‌వ‌ర్గ ప్రజలను కోరుతున్న‌ట్లు విశాల్ తెలిపారు. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని విశాల్ వెల్ల‌డించారు. ఈ ఇద్ద‌రినీ తాను క‌ల‌వ‌లేద‌ని పేర్కొంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...త‌న‌కు సామాన్యుడిగా ఉండ‌టం ఇష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచినా - ఓడినా త‌న‌కు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ముఖ్య‌మన్నారు. ఆర్కే న‌గ‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల తాగు నీరు - పాఠ‌శాల‌లోని - ఆస్ప‌త్రుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో గెలిచినా - గెల‌వ‌లేక‌పోయినా....తాను వీటికి అంకితంగా ప‌నిచేస్తాన‌ని అన్నారు.

కాగా, రాజ‌కీయాల్లోకి మొద‌టి సారి అరంగేట్రం చేస్తున్న‌ప్ప‌టికీ...సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఇప్ప‌టికే విశాల్‌ కు మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. సినీ న‌టులు కుష్బూ - ప్ర‌కాశ్ రాజ్‌ - ఆర్య ఇప్ప‌టికే విశాల్‌ కు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ఇప్పటివ‌ర‌కు తాను ఎవ‌రి మ‌ద్ద‌తు కోర‌లేద‌ని..అయితే తాను సంప్ర‌దిస్తే మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ప‌లువ‌రు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. కాగా, క‌మ‌ల్‌ హాస‌న్‌ ను సంప్ర‌దించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు విశాల్ వెల్ల‌డించారు.

కాగా, ప‌లు అంశాల‌పై విశాల్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న త‌మిళ‌నాడు రైతుల‌కు హ‌స్తిన‌కు వెళ్లి సైతం విశాల్‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. త‌మిళనాడులో జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని జరుగుతోన్న ఆందోళనపై విశాల్ స్పందించారు. ఇది ఆందోళన కాదని - విప్లవమని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. తాము చేస్తోన్న విప్లవ నినాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని తెలిపారు. జల్లికట్టును జంతు హింసగా పరిగణించరాదని విశాల్ కోరారు. కాగా, ఒకానొక స‌మ‌యంలో విశాల్‌ను బీజేపీలో చేరేందుకు ఒప్పించే బాధ్యతలను చెన్నై నివాసి - మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కు అప్పగించినట్టు ప్ర‌చారం సాగింది.