Begin typing your search above and press return to search.

ఏపి బిజేపీలో లుకలుకలు

By:  Tupaki Desk   |   3 Sep 2018 7:37 AM GMT
ఏపి బిజేపీలో లుకలుకలు
X
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న వారిని ప్రక్కన పెట్టడంపై రాష్ట్ర బిజేపీ నాయకులు - ఇంకా కినుక వహిస్తూనే ఉన్నారు. దీంతో పక్క పార్టీల వైపు కమలనాధులు చూస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహరిస్తున్న తీరుపై కూడా పార్టీలో అసంత్రుప్తి మొదలైదంటున్నారు. కన్నా లక్ష్మీ నారయణ తన వర్గీయులు, తన అనుయాయులను మాత్రమే పట్టించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీ నారయణను అధ్యక్షుని చేయడమే కాకుండా అన్నీ అంశాలపై అధిష్టానం ఆయనతోనే చర్చించడంపై కమలనాధులు భగ్గుమంటున్నారని సమాచారం. విశాఖ జిల్లా ఎమ్మెల్యే - బిజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు అనధికారికంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ కు సహకరిస్తున్నారని వినిపిస్తోంది. ఆయన జగన్‌ తో విడిగా నాలుగైదు సార్లు సమావేశమైనట్లు చెబుతున్నారు. విష్ణుకుమార్ రాజు నేరుగా పార్టీలో చేరకపోయిన జగన్‌ కు - ఆయన పార్టీకి వెనుక నుంచి సహకరిస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీనిని విష్ణుకుమార్ రాజు సహచరులు కూడా ధ్రువీకరిస్తున్నారు.

ఇక తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులలో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే - భారతీయ జనతా పార్టీ సినీయర్ నాయకుడు ఆకుల సత్యనార‍యణ తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ మోసం చేసిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన్నట్లు సమాచారం. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారయణ పాల్గోన్నారు. బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోయిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాత్రం జనసేనకు అనుకూలంగా మాట్లడినట్లు సమాచారం. ఇక భారతీయ జనతా పార్టీకి చెందిన దిగువ శ్రేణి నాయకులు - కార్యకర్తలు కూడా మరో పార్టీలో చేరాలనుకుంటున్నట్లు సమచారం. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎక్కువ మంది కార్యకర్తలు - నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఆదరణ తగ్గిందని - వచ్చే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని సర్వేలు పేర్కొనడంతో కమలనాధులు అటువైపే పరుగు పెడుతున్నారు. ఆర్ ఎస్ ఎస్‌ తో మమైకమైన వారు తప్ప మిగిలిన వారంత పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.