Begin typing your search above and press return to search.

రాజుగారి అస్త్రం!... బాబు బుక్కైన‌ట్టే!

By:  Tupaki Desk   |   15 April 2018 9:46 AM GMT
రాజుగారి అస్త్రం!... బాబు బుక్కైన‌ట్టే!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప‌న్నుతున్న వ్యూహాలు మ‌రింత‌గా ప‌దునెక్కుతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టిదాకా త‌న మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న‌ను మాత్ర‌మే దోషిగా నిల‌బెడుతూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న వైనానికి విరుగుడుగా బీజేపీ కూడా స‌రికొత్త వ్యూహాలు అమ‌లు చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. బీజేపీ వ్యూహాల ముందు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న అవినీతిని ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయ‌న్న వాద‌న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఈ త‌ర‌హా వ్యూహంతో బీజేపీ త‌న స్పీడును పెంచేయ‌గా... అందుకు ప్ర‌తిగా ఎలా ముందుకు వెళ్లాల‌న్న విష‌యం అర్థం కాక టీడీపీ త‌ల ప‌ట్టుకున్న‌ట్లు స‌మాచారం.

అయినా ఇప్పుడు బీజేపీ ర‌చించిన కొత్త వ్యూహం ఏమిటన్న విష‌యానికి వ‌స్తే... బాబు జ‌మానాలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌ని, బాబు పాల‌న మొత్తం అవినీతిమ‌య‌మేన‌ని కూడా బీజేపీ ఆది నుంచి ఆరోపిస్తూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్నా కూడా బీజేపీకి చెందిన ఏపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు అవినీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బీజేపీతో టీడీపీ బంధం తెంచుకున్న నేప‌థ్యంలో వీర్రాజు ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత మంది బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌లు తోడ‌య్యాయ‌ని చెప్పాలి. మిగిలిన వారి ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా... ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విశాఖ ఉత్త‌ర నియోజక‌వ‌ర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీరే వేర‌ని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ - టీడీపీల మైత్రి ముగిసిన నేప‌థ్యంలో అసెంబ్లీలో మోదీ స‌ర్కారుపై బాబు విరుచుకుప‌డ‌గా... స‌భ‌లోనే ఉన్న రాజు.. చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యే త‌ర‌హాలో త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించారు.

మొత్తంగా మ‌నిషి ఎదురుగా ఉన్నప్పుడే త‌న‌దైన శైలి ఆరోప‌ణ‌లు గుప్పించ‌డంలో ఆరితేరిన రాజు... చంద్ర‌బాబు స‌ర్కారు గొప్ప‌గా చెప్పుకునే ప‌ట్టిసీమ ప్రాజెక్టులో భారీ అవినీతి జ‌రిగింద‌ని చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌ట్టిసీమ‌లో మొత్తంగా ఎంత‌మేర అవినీతి జ‌రిగింది? ఆ అవినీతి ఏఏ విభాగంలో ఎంతెంత‌? అన్న విష‌యాల‌పై ప‌క్కా ఆధారాలు వెలికితీసిన రాజుగారు.. ఇప్పుడు బాబును అడ్డంగా బుక్ చేసే వ్యూహానికి ప‌దును పెట్టారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని తాము ఎప్ప‌టినుంచో చెబుతూనే ఉన్నామ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. అందులో అవినీతి జరగలేదంటే చంద్రబాబు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలని కూడా రాజు స‌వాల్ విసిరారు. బాబు పాల‌న‌లో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని కూడా ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ - ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని రాజు డిమాండ్‌ చేశారు. మ‌రి రాజు సంధించిన వ్యూహానికి బాబు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.