Begin typing your search above and press return to search.

ఏంది విష్ణు..అలా మొక్కితే మోడీకి మొక్కిన‌ట్లా?

By:  Tupaki Desk   |   4 April 2018 4:38 AM GMT
ఏంది విష్ణు..అలా మొక్కితే మోడీకి మొక్కిన‌ట్లా?
X
వ్య‌క్తిగ‌త పూజ సంగ‌తి ఎలా ఉన్నా.. పొగిడేందుకు ఉన్న హ‌ద్దుల‌న్నింటిని చెరిపేస్తున్నారు బీజేపీ నేత‌లు. పొగ‌డ్త‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌టంలో కాంగ్రెస్ నేత‌ల‌కున్న అనుభ‌వాన్ని చిన్న‌బుచ్చేలా బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు ఉంటున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు ముచ్చ‌టే చూడండి. ఆయ‌న గారి నోటి నుంచి వ‌స్తున్న ఆణిముత్యాల్లాంటి మాట‌ల్ని రాసుకోవ‌టానికి ప‌దుల సంఖ్య‌లో సాంబాల్ని పెట్టుకోవ‌టం అవ‌స‌ర‌మేమో?

మోడీపై తెలుగు త‌మ్ముళ్లు విరుచుకుప‌డ‌టం మొద‌లెట్టి కొంత‌కాల‌మైనా.. గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అవుతున్న వేళ‌.. ఆయ‌నకు చెక్ పెట్టేందుకు వీలుగా ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌టం లేదు క‌మ‌ల‌నాథులు. తాజాగా ప్ర‌త్యేక హోదా పేరుతో ఢిల్లీకి వెళ్లి హ‌డావుడి చేస్తున్న చంద్ర‌బాబు.. పార్ల‌మెంటు మెట్ల ద‌గ్గ‌ర మొక్క‌టం తెలిసిందే.

ఫోటోలకు ఫోజులిచ్చేందుకు బాబు చేసే చేష్ట‌ల్లో తాజాగా పార్ల‌మెంట్ మెట్లు మొక్కిన ఘ‌ట‌న ప‌లువురికి న‌వ్వు తెప్పించేలా ఉంది. పార్ల‌మెంటు మీద భ‌క్తి ఉండాలే కానీ.. మెట్ల‌ను మొక్కితే మీడియాలో ప్ర‌ముఖంగా ప‌డ‌తామ‌న్న‌ట్లుగా బాబు తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. బాబు చేష్ట‌లు కామెడీగా మారిన వేళ‌లో.. విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు కామెడీకి ప‌రాకాష్ఠ‌గా మార‌ట‌మే కాదు.. ఓర్నీ యేషాలో అన్న‌ట్లుగా మారాయి.

ఎందుకిలా అంటే.. పార్ల‌మెంటు మెట్ల‌కుమొక్కితే ప్ర‌ధానికి మొక్కిన‌ట్లేన‌ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించ‌ట‌మే ప్ర‌జాస్వామ్యంలో ఏ మాత్రం స్వాగ‌తించ‌లేని రీతిలో విష్ణు మాట‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ సైతం పార్ల‌మెంటుకు బాధ్యుడే కానీ.. పార్ల‌మెంటుకు అతీతుడు కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. విష్ణు తీరు చూస్తుంటే.. రాజ‌రిక జ‌మానాలో ఉన్న‌ట్లుంది. ఐదేళ్ల ప‌ద‌వీకాలానికి మాత్ర‌మే మోడీని ఎన్నుకున్నారే త‌ప్పించి.. ప‌ర్మినెంట్ గా మాత్రం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు విష్ణు సంగ‌తేమో కానీ.. మోడీ మీద గౌర‌వం త‌గ్గ‌టం ఖాయం. మోడీ మీదున్న అభిమానం ప్ర‌క‌టించ‌టానికి కొత్త దారులు వెతుక్కోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అవేవీ వెగ‌టు పుట్టించేలా ఉండ‌కూడ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. రాజుగారు.. కాస్త కేర్ ఫుల్ గా మాట్లాడండి సార్‌.