Begin typing your search above and press return to search.

బాబు డబ్బులిచ్చి సర్వే చేయించుకున్నారా?

By:  Tupaki Desk   |   2 Dec 2016 3:55 AM GMT
బాబు డబ్బులిచ్చి సర్వే చేయించుకున్నారా?
X
కలిసి ఉన్నామనే కానీ.. కలిసిపోని మనసులుగా కనిపిస్తాయి ఏపీలోని టీడీపీ.. బీజేపీల దోస్తానా చూస్తే. పైకి ఫ్రెండ్ అన్నట్లుగా చెప్పుకున్నప్పటికీ లోపల మాత్రం ఎవరి ఎజెండా వారిదే అన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో.. సాంకేతి అంశాల కారణంగా కలిసి ఉన్న రీతిలో ఏపీ టీడీపీ.. బీజేపీ నేతల తీరు ఉంటుంది. అతుకుల బొంతలా ఉండే వారి మిత్రత్వానికి తాజాగా బయటకు వచ్చిన సర్వే షాకింగ్ గా మారింది.

ఒక ప్రముఖ మీడియా సంస్థ.. తాను గ్రౌండ్ లెవల్లో సర్వే చేయించానని చెబుతూ.. గడిచిన నాలుగు రోజులుగా ఆ ఫలితాలతో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఏపీలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కేవలం 20 శాతం కంటే తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఫలితం రాష్ట్రం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని అడిగితే.. అదంతా కూడా టెక్నికల్ గా చూసుకొనే చేశామని చెబుతున్నారు.

వీరి సర్వేపై విపక్షం విరుచుకుపడగా.. అధికారపక్షంలో భాగస్వామ్యమైన బీజేపీ కుతకుతలాడిపోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ కలిసి పోటీ చేస్తే 120 సీట్లు మాత్రమే వస్తాయని.. అదే సమయంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 140 సీట్లు వస్తాయని చెప్పటం సంచలనంగా మారింది. బీజేపీ టీడీపీకి మోయలేని భారంగా మారిందని.. బీజేపీని వీలైనంతవరకూ వదిలేసుకోవాలన్నట్లుగా సర్వే ఫలితాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సర్వే ఫలితాలపై ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు రియాక్ట్ అయ్యారు. సర్వే ఫలితాల విశ్వసనీయతను ప్రశ్నించిన ఆయన.. సింపుల్ గా చాలా పెద్ద మాటనే అనేశారు. సర్వే కథనం మొత్తం రాజకీయ కుట్ర అని.. అదో కిరాయి సర్వేగా మండిపడ్డారు. ఒకవేళ ఈ సర్వే కానీ నిజమని చంద్రబాబు నమ్మి.. అధికారికంగా ఒక ప్రకటన చేస్తే.. తమ కార్యాచరణలో తాము ఉంటామని చెప్పటం ద్వారా.. సర్వే ఫలితాలు ఏపీ కమలనాథులపై ఎంత ప్రభావం చూపాయన్నది ఇట్టే తెలుసుకునే వీలుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/