Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీ ఆటాడిస్తోందా..?

By:  Tupaki Desk   |   17 Jan 2017 10:12 AM GMT
బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీ ఆటాడిస్తోందా..?
X
శాసనసభలో కానీ, బయట కానీ పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తూ ఎన్నోమార్లు సీఎం చంద్రబాబను విపక్షాల బాణాల నుంచి తప్పించి విశాఖ పట్నం ఎమ్మెల్యే, బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ విష్ణుకుమార్ రాజుకు టీడీపీ నేతలు, వారి మాటల ప్రకారం నడుచుకునే అధికారుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయట. ముక్కు సూటిగా మాట్లాడే ఆయనకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారట. దీంతో రీసెంటుగా ఆయన ఇప్పటికే బాహాటంగా ఫైరయ్యారు కూడా. అయినా అధికారులు మాత్రం ఆయన్ను ఆడుకుంటున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్‌ లో అవినీతి విజృంభిస్తోందని, లంచం ఇవ్వనిదే ఏ ఒక్క పని కూడా జరగడం లేదని ఇటీవల విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో చంద్రబాబు ఇరుకునపడిన సమయంలో పలుమార్లు పెద్దమనిషి అవతారమెత్తి బాబును బయటపడేసిన ఆయన ఇటీవల ప్రభుత్వం తీరుపై మండిపడుతుండడంతో టీడీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేశారని టాక్.

టీడీపీ నేతలు నేరుగా ఏమీ చేయకుండా అధికారులతో కథ నడిపిస్తున్నారని చెబుతున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో నడుచుకుంటున్న అధికారులు ఆయన్ను అస్సలు లెక్క చేయడం లేదట. కనీసం సమీక్ష సమావేశాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదట. దీనిపై సోమవారం ఆయన ఫైర్ అయ్యారు. మంగళవారం విశాఖకు సీఎస్ టక్కర్ వస్తున్నారు. ఆ సమాచారం కూడా స్థానిక ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్‌ రాజుకు చెప్పలేదట. దీంతో విషయం తెలియని రాజు గారు ఇళ్ల నిర్మాణంపై సీఎస్‌ ను కలిసేందుకు నేరుగా విజయవాడ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మీరెందుకు వచ్చారు. రేపు నేనే విశాఖ వస్తున్నా కదా అని సీఎస్ చెప్పడంతో విష్ణుకుమార్ ఖంగుతిన్నారు. కావాలనే అధికారులు తనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సీఎస్ వస్తున్న విషయం ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అధికారులు ఈ మధ్య విష్ణుకుమార్‌ రాజును లెక్కచేయకపోవడానికి కారణం వేరే ఉందంటున్నారు. ఏపీలో అవినీతి విజృంభిస్తోందని, లంచం ఇవ్వనిదే పని జరగడం అసాధ్యంగా మారిందని వ్యాఖ్యానించడం వల్లే ఆయన్ను ప్రభుత్వం అవమానిస్తోందని చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా విష్ణుకుమార్‌ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/