Begin typing your search above and press return to search.

బాబుకు బీపీ లేపే కామెంట్లు చేసిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   24 Jan 2018 3:30 PM GMT
బాబుకు బీపీ లేపే కామెంట్లు చేసిన ఎమ్మెల్యే
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచే వ్యాఖ్య‌లు చేశారు ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఎమ్మెల్యే - ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ విష్ణుకుమార్ రాజు. సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయాల తీరును ప్ర‌శ్నించేలా ఇంకా చెప్పాలంటే..ఆయ‌న ఇమేజ్‌పై నెగెటివ్ ముద్ర వేసేలా సాగిన జంప్ జిలానీల ప‌ర్వం - వారికి మంత్రిప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన తీరుపై ఇప్ప‌టికే ప‌లువ‌ర్గాలు విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ పై తాజాగా విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. గ‌త వారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌గా..తాజాగా ఏకంగా బాబునే టార్గెట్ చేశారు.

ఇటీవ‌ల టీడీపీ స‌ర్కారును ఇర‌కాట‌లో ప‌డేస్తున్న ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా పార్టీ ఫిరాయించిన మంత్రులనే టార్గెట్‌ చేశారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణమ‌ని ఆయ‌న వ్యాఖ్ఆయ‌నించారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్‌ చేశారు. ఒకవేళ‌ అలా కుదరకపోతే పార్టీ ఫిరాయించినా సరే మంత్రులు కావచ్చు అనే కొత్త చట్టం తీసుకురావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తద్వారా బాబు తీరును బ‌హిరంగంగా ఎద్దేవా చేశారు.

కాగా, గ‌త‌వారంలో ఏపీ మంత్రి లోకేష్‌ను ఇర‌కాటంలో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఐటీ రంగంలో ప‌రిస్థితులు ఒక‌లా ఉంటే..లోకేష్ ఇంకోలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పదేళ్లలో 10లక్షల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి లోకేష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఒక‌వైపు ఐటీ ప‌రిశ్ర‌మ‌లో ఉద్యోగాలు ఇబ్బందుల్లో ప‌డితే... చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని అవినీతి - శాంతిభ‌ద్ర‌త‌ల తీరుపై బీజ‌పీ ఫ్లోర్ లీడ‌ర్ విమ‌ర్శ‌లు చేశారు. అవినీతి - రౌడీయిజం వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విచ్చ‌ల‌విడిగా ఇసుకదందా జ‌రుగుతుంటే దానిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు మ‌ద్యం పాల‌సీపై కూడా మిత్ర‌ప‌క్ష ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు మండిప‌డ్డారు. భూమిపై స్థలం లేకుంటే సముద్రంలో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని ఆయ‌న ఎద్దేవా చేశారు. విశాఖలో తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీపై ఏసీబీ సోదాలు జరిపించానని, వందల కోట్ల అవినీతి సొమ్మును జప్తు చేయించానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వివ‌రించారు. రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 10 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.