Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పై బాబు విమ‌ర్శ‌ల గుట్టు చెప్పిన విష్ణు

By:  Tupaki Desk   |   6 April 2018 10:14 AM GMT
జ‌గ‌న్ పై బాబు విమ‌ర్శ‌ల గుట్టు చెప్పిన విష్ణు
X
హోదా సాధ‌న సంగ‌తేమో కానీ.. ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. వేస‌విలో మండే ఎండ‌ల‌కు రెట్టింపు అన్న‌ట్లుగా ఏపీలోని రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం.. స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్ల‌తో వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం ఉంటుంది. అందుకు భిన్నంగా సార్వ‌త్రికానికి ఏడాది ముందే.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయిన ప‌రిస్థితి ఏపీలో నెల‌కొంది.

హోదా సాధ‌న విష‌యంలో మైలేజీప‌రుగు పందెం పార్టీల మ‌ధ్య నెల‌కొంది. వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ పార్టీ వెళుతుంటే.. ప్ర‌త్య‌ర్థి పార్టీ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అప్ప‌టిక‌ప్పుడు ఏపీ అధికార‌ప‌క్షం నిర్ణ‌యాలు తీసుకుంటూ అభాసుపాల‌వుతోంది. ఇదిలా ఉంటే.. జ‌న‌సేన పార్టీ మాత్రం మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ ఇచ్చుకుంటూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌ల‌పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోప‌ణ‌లు చేశారు.

బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేన పార్టీలు కుమ్మ‌క్కై.. తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన ప‌ర్చాల‌ని భావిస్తున్న‌ట్లుగా బాబు చెప్ప‌టాన్ని విష్ణు త‌ప్పు ప‌ట్టారు. రాజ‌కీయంగా జ‌గ‌న్ ను ఎదుర్కోలేక‌నే టీడీపీ త‌మ‌ను టార్గెట్ చేసింద‌ని ఆరోపించారు. బీజేపీ 39వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విష్ణు.. టీడీపీపైనా.. ఆపార్టీ అధినేత‌పైనా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశారు.

ఏపీలో రాష్ట్ర స‌ర్కారు ఏక‌ప‌క్షంగా అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హిస్తోంద‌ని త‌ప్పు ప‌ట్టారు. అసెంబ్లీలో త‌ప్పులు ఎత్తి చూపిస్తే.. మైక్ క‌ట్ చేస్తున్నార‌ని.. అరిచి గోల చేస్తే ఒక్క‌రోజు మాట్లాడే అవ‌కాశం ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. ఈ కార‌ణంతోనే జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల్ని బహిష్క‌రించి ఉంటార‌న్నారు. విశాఖ‌లో భూకుంభ‌కోణాల వెనుక ఉన్న‌ది టీడీపీ మంత్రి కాదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఈ స్కాంకు సంబంధించి సిట్ ద‌ర్యాప్తును ఎందుకు నిలిపివేశార‌ని ప్ర‌శ్నించారు.

భూకుంభ‌కోణాల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్రంలోనే మొద‌టిస్థానంలో ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు.. అభివృద్ధికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా నిర‌స‌న‌లు తెలియ‌జేసే హ‌క్కు ఉంటుంద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా అంద‌రి మాదిరే నిర‌స‌న తెలియ‌జేసే హ‌క్కు ఉంద‌న్నారు. ఇన్ని మాట్లాడిన విష్ణు.. లోక్ స‌భ‌లో ఏపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చ‌ర్చ‌కు ఎందుకు రానివ్వ‌లేదో కూడా క్లారిటీ ఇస్తే బాగుండేది క‌దా? నీతులు చెబుతున్న గురివింద లాంటి విష్ణు.. న‌లుపు గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది క‌దా?