Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల బాబు భ‌జ‌న‌పై మిత్రుడికి మండింది

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:20 AM GMT
త‌మ్ముళ్ల బాబు భ‌జ‌న‌పై మిత్రుడికి మండింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌హా ఇబ్బంది మొద‌లైంది. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. జంపింగ్ ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోని వైనానికి నిర‌స‌న‌గా వారు స‌భ‌కు హాజ‌రు కావ‌టం లేదు. దీంతో.. స‌భ‌లో విప‌క్ష నేత‌లు హాజ‌రు కావ‌టం లేదు. అధికార‌ప‌క్షం.. వారి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే స‌భ‌కు వ‌స్తున్నారు.

ఇలాంటి వేళ‌.. మిత్రుని నోటి నుంచి ఊహించ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు చంద్ర‌బాబు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న తీరుపై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర అస‌హ‌నంతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో భ‌జ‌న ఓ మోస్త‌రుగా ఉంటే ఫ‌ర్లేదు కానీ.. శృతిమించితేనే ఇబ్బంద‌న్నారు.

భ‌జ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌టంతో నిద్ర వ‌స్తోంద‌ని.. చెవి నొప్పులు వస్తాయ‌న్నారు. స్పీక‌ర్ త‌మ‌వైపు కూడా చూడ‌టం లేద‌న్న విష్ణుకుమార్ రాజు.. అమృత ప‌థ‌కం మీద త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేన‌ప్పుడు మాట్లాడే అవ‌కాశం త‌మ‌కు ఇవ్వాల‌న్నారు. స్పీక‌ర్ త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టం బాధాక‌ర‌మ‌న్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. స‌రిగ్గా ఇలాంటి మాట‌లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చేవి. అసెంబ్లీ స‌మావేశాల్లో మాట్లాడే అవ‌కాశాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి స్పీక‌ర్ ఇవ్వటం లేదని ఆరోపించేవారు. ఇలాంటి విమ‌ర్శ‌ల్ని టీడీపీ నేత‌లు కొట్టిపారేశారు. విప‌క్ష నేత‌లు కావాల‌ని అల్ల‌రి చేసేవారంటూ విమ‌ర్శ‌లు చేసేవారు. విప‌క్షం ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసిందో.. ఇప్పుడు మిత్ర‌ప‌క్షం నేత నోటి నుంచి ఇంచుమించు ఆ త‌ర‌హాలోనే అసంతృప్తి వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం.

కేంద్రం నిధులు ఇస్తున్న ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేసుకోవ‌టంపైనా విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్య‌క్తం చేవారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి ఎన్టీఆర్ నిధులు ఇస్తున్నాడ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.ఈ ప‌థ‌కానికి మెజార్టీ నిధులు కేంద్రం నుంచి వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన విష్ణు.. అధికార‌ప‌క్షం తీరుపై త‌న అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా సాగుతున్న స‌భ‌లో బాబు భ‌జ‌న త‌ప్ప మ‌రేమీ ఉండ‌ద‌నుకున్న వేళ‌.. మిత్రుడి నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఏపీ అధికార‌ప‌క్షానికి ఊహించ‌ని షాక్ గా మారాయి.