Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌జ‌ల‌ను ఊరిస్తున్న బీజేపీ ముఖ్య‌నేత‌

By:  Tupaki Desk   |   4 Sep 2016 8:18 AM GMT
ఏపీ ప్ర‌జ‌ల‌ను ఊరిస్తున్న బీజేపీ ముఖ్య‌నేత‌
X
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంపై అన్ని స్థాయిల్లోను తర్జన భర్జన జరుగుతున్న నేపధ్యంలో విజ‌య‌వాడ‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు - జిల్లా అధ్యక్షులు - ఇన్‌ ఛార్జిల సమావేశంలో పాల్గొన్న పార్టీ జాతీయ కార్యదర్శి - రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్ మాత్రం ప్రత్యేక హోదా లేనట్లేనని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. సమావేశం అనంతరం వివరాలను మహిళామోర్చా జాతీయ ఇన్‌ చార్జి - మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రేశ్వరితోపాటు శాసనసభ్యులు విష్ణుకుమార్‌ రాజు మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీనా - ప్రత్యేక హోదా అనేది త్వరలో వెలువడనుంది... తొందర్లోనే ఏపీ ప్రజలు శుభవార్త వింటారని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. హోదా పేరు లేకుండా మంచి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు విష్ణు చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు - అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ గా మారిందని అందుకే కేంద్ర ప్రతినిధులకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనే చెప్పామని విష్ణు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోటానికి రాష్ట్ర నాయకులు ఇక విస్తృతంగా పర్యటిస్తున్న‌ట్లు తెలిపారు. జాతీయ నాయకులు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేకంగా మాట్లాడార‌ని, ఏపీని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నందున అభివృద్ధికి పూర్తి సహకారం అందించటం తమ బాధ్యతగా జాతీయ నాయకులు స్పష్టం చేశారని వారు వివ‌రించారు. 14వ ఆర్ధిక సంఘం సిపారసుల‌ అమలు తరువాత కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు భరించడమనేది అర్ధం లేకుండా పోయిందన్నారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి ప్రత్యేక హోదా కోరుతున్న 11 రాష్ట్రాలకు అదనపు సహాయం చేసేందుకు కేంద్రం నిర్ణయించుకుందని ఇందులో ఏపీ కూడా ఉందని వారు స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు అందజేసిన తరువాతే మిగిలిన నిధులను పంపడం జరుగుతుందని పురంధ్రేశ్వరి స్పష్టం చేశారు. ఖాతాలో ఆడిట్ వ్యవహారాల పరిశీలన తరువాత రాష్ట్ర ఆర్ధిక లోటును కేంద్రం తప్పక చెల్లిస్తుందని చెప్పారు. అయినప్పటికీ 2015-16కు సంబంధించి రూ.4వేల కోట్లను కేంద్రం చెల్లించిందని చెప్పారు. పోలవరం నిర్మాణ వ్యయం బిల్లులను సకాలంలో అందించి అధార్టీని సంతృప్తిపరిస్తే వెంటనే కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇప్పటికి రెండు విడతలుగా రూ.700 కోట్లు చెల్లించామని అయితే వీటికి నేటివరకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు రాలేదన్నారు.

బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్‌ గా ఉన్న విష్ణుకుమార్ రాజు ప్ర‌క‌ట‌న చూస్తుంటే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ప్ర‌క‌ట‌నలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని చెప్తున్నారు. తీపిక‌బురు పేరు చెపుతూ సుజ‌నా ఊరిస్తున్న రీతిలోనే విష్ణుకూడా చేయ‌డంలేదు క‌దా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.