Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను మెచ్చుకుంటున్న బీజేపీ నేత లెక్కేంటో

By:  Tupaki Desk   |   14 Jun 2019 9:08 AM GMT
జ‌గ‌న్‌ ను మెచ్చుకుంటున్న బీజేపీ నేత లెక్కేంటో
X
విష్ణుకుమార్ రాజు గుర్తుండే ఉంటారు? గ‌త అసెంబ్లీ స‌మావేశాల వ‌ర‌కు బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ఎమ్మెల్యే. అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై త‌న‌దైన శైలిలో ఆయ‌న కామెంట్లు చేసేవారు. ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం ఢిల్లీలో అనూహ్య‌రీతిలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబును క‌లిసి...మీరే సీఎంగా ఉండాల‌ని కూడా ఆకాంక్షించారు. బీజేపీ-టీడీపీల మ‌ధ్య ఉప్పునిప్పుగా సంబంధాలున్న త‌రుణంలో...విష్ణుకుమార్ రాజు వ్య‌వ‌హార‌శైలి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ట్ చేస్తే ఆయ‌న తాజాగా వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌శంస‌లు కురిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు.

విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇసుక ఫ్రీ పాలసీని టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారని - ఇసుకు పేరిట విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాజాగా జగన్ ప్రభుత్వం ఇసుక పాలసీకి కొత్తరూపు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలున స్వాగతించారు. అప్పటి వరకూ ఇసుక సరఫరాకు లోటు లేకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిర్మాణ రంగం కుదేలై ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్వాగతించద‌గ్గ పరిణామంగా విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడి అవినీతి చోటుచేసుకుందని - పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై తాను గతంలోనే సీబీఐ విచారణ కోరానని గుర్తు చేశారు. శాసనసభలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, అప్పుడే అధికార పక్షం తప్పిదాలకు తావులేకుండా ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం విపక్షంలో ఉన్న వారిలో అత్యధికులు అవినీతి పంకిలం అంటుకున్నవారేనని ఆరోపించారు. విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నివేదికను బయటపెడితే తమకు ఇబ్బందిగా భావించిన టీడీపీ ప్రభుత్వం అందుకు సాహసించలేదన్నారు.

ఈ సంద‌ర్భంగా రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని వ్యతిరేకించడంతోనే టీడీపీ పతనం ఆరంభమైందని విష్ణుకుమార్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తన చివరి రోజుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన విమర్శలు, తీసుకున్న యూ టర్న్‌లు ప్రజలు గమనించారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం ఓట్ల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి జ‌గ‌న్ పాటుప‌డాల‌ని కేంద్రం త‌గు రీతిలో స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియ‌ర్ నేత అయిన విష్ణు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.