Begin typing your search above and press return to search.

పవన్ కు తామరదెబ్బ : తత్వం తెలిసిందా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 4:29 PM GMT
పవన్ కు తామరదెబ్బ : తత్వం తెలిసిందా?
X
‘‘భజన చేసినంత కాలమూ తమర్ని వారు కూడా నెత్తిన పెట్టుకుని మోస్తారు. పల్లకిలో పెట్టుకుని బోయీల్లా మోస్తారు. ప్రశ్నించడం అనేది కేవలం మాటల రూపంలో కాకుండా మీరు కార్యరూపంలోకి తెచ్చినప్పుడు.. వారు పల్లకీని పక్కన పడేసి.. మిమ్మల్ని వదిలించుకోవాలని అనుకుంటారు. పవన్ బాబూ.. తమరికి ఇది కొత్త కావచ్చు.. కానీ.. ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటే తత్వం బోధపడుతూ ఉంటేనే రాజకీయాల్లో తమరు రాటు దేలే అవకాశం ఉంటుంది...’’ అని ప్రజలు పవన్ కల్యాణ్ గురించి అనుకుంటున్నారు.

అవును మరి.. పవన్ కల్యాణ్ గత ఏడాది తన రాజకీయ సెకండిన్నింగ్స్ ను ప్రారంభించినప్పటినుంచి.. ప్రజలకు ప్రశ్నించడం నేర్పుతా అని పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ఆ ప్రశ్నించడం ఏమిటో ఎలాగో ఎవ్వరికీ అర్థం కాలేదు. తీరా ఇన్నాళ్ల తర్వాత.. ఆయన తొలిసారిగా ప్రశ్నించడం అనేది ప్రారంభించారు. రాష్ట్రానికి ఏం ఇచ్చారో అటు కేంద్రమూ - ఏం వచ్చిందో ఇటు రాష్ట్రమూ తనకు లెక్కలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

తీరా ఆయన పనితీరు ఇంతదాకా వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఏదో సినీ హీరో తమకు ఉపయోగపడుతున్నాడు కదా అని ఇన్నాళ్లూ ఊరుకుంటే.. తమనే నిలదీసే దాకా వచ్చేసరికి వారి అసలు స్వరూపం చూపిస్తున్నారు. భాజపా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్.. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. పవన్ ఆధ్వర్యంలోనే జేఎఫ్ సీకి అసలు ఏం అధికారం ఉన్నదని.. ఆయన లెక్కలు అడుగుతున్నారు అంటూ ఘాటుగా సెలవిస్తున్నారు.

మీ అధికారానికి బాటలు తీర్చిన నాయకుడిగా అడిగే హక్కు ఉండదా అని పవన్ అభిమానులు రెచ్చిపోవచ్చు గాక.. కానీ అంతకంటె కీలకాంశం మరొకటి ఉంది. ప్రభుత్వాల్ని లెక్కలు అడగడానికి అధికారం ఎందుకు ఉండాలి. ఈ దేశంలో సమాచార హక్కు అంటూ ఒక చట్టం ఉంది. ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతున్నదో.. ఏం అందుతున్నదో విపులంగా తెలియజెప్పమనడానికి దేశంలోని ప్రతి పౌరుడికీ చట్టబద్ధమైన హక్కు ఉంది. పది రూపాయలు చెల్లిస్తే చాలు.. అడిగిన సమస్త వివరాలను చెప్పాల్సిందే.. అవేమైనా దేశ భద్రతకు సంబంధించిన వివరాలైతే తప్ప.. వెల్లడించాల్సిందే. దేశం సమాచారం పరంగా పౌరులకు అంత హక్కులు ఇస్తున్నప్పుడు.. పవన్ కల్యాణ్ కు హోదాలు - పార్టీలు- అధికారాలు అక్కర్లేదు.. సామాన్య పౌరుడిగా కూడా అడగవచ్చు. ఆ సంగతి కమలదళం ఎమ్మెల్యేగారికి తెలుసో లేదో.. అని జనం అనుకుంటున్నారు. పవన్ బాబూ.. తామర దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తున్నదా అని వారు అనుకుంటున్నారు.