Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలపై విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   27 Sep 2022 7:59 AM GMT
వైసీపీ నేతలపై విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్
X
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతేనంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర 2.0 చేపట్టిన సంగతి తెలిసిందే.అమరావతి టు అరసవెల్లి పేరుతో అమరావతి రైతులు చేస్తున్న ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వైనం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని, కానీ కేవలం అమరావతిని అభివృద్ధి చేయాలన్న దిశగా టీడీపీ ఆలోచిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇది రైతుల పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్రపై దండయాత్ర అని వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ వ్యతిరేకం అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని పలువురు వైసీపీ నేతలు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాంధ్రలో పాదయాత్రను అడ్డుకుంటామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉత్తరాంధ్ర ఏమన్నా వైసీపీ నేతల సొంత జాగీరా అని ఆయన ప్రశ్నించారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఎవరైనా ఎప్పుడైనా దర్శించుకోవచ్చని, బుర్ర లేనివారే దర్శించుకోవద్దంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రలో దారుణాతి దారుణంగా నష్టపోయిన వారు అమరావతి రైతులేనని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు .

ఉత్తరాంధ్రలో రైతులు పాదయాత్ర చేస్తే వైసీపీ నేతలు ఊరుకోబోమంటున్నారని, అటువంటి వారంతా ఇంట్లోనే కూర్చోవాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. అమరావతి రైతులను బెదిరించడం సరికాదని హితవు పలికారు. అంతేకాదు, రైతుల పాదయాత్రకు బీజేపీ మద్దతు ఉంటుందని, అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు.

గత మూడున్నరేళ్ల నుంచి అమరావతి రైతులను జగన్ ప్రభుత్వం మానసిక క్షోభకు గురి చేస్తోందని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రపై అవసరమైతే కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుందని విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.