Begin typing your search above and press return to search.

దగ్గరవుతున్న వైసీపీ - బీజేపీ

By:  Tupaki Desk   |   25 Jan 2018 4:20 AM GMT
దగ్గరవుతున్న వైసీపీ - బీజేపీ
X
సీఎం చంద్రబాబు రాష్ఱ్టంలో లేనివేళ ఏపీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లగా ఆయన ఆఫీసులో, ఆయన కుర్చీలో కూర్చుని బావమరిది కమ్ వియ్యంకుడు అయిన బాలయ్య సమీక్షలు నిర్వహించడం ఒక విశేషమైతే రెండోది టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ప్రతిపక్ష ఎమ్మల్యే నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో ఆయనతో పాటు పాల్గొనడం.

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బుధవారం వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం టీడీపీలో కలకలం రేపింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పక్కనే కూర్చొని విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయాలని అన్నారు. లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చని చట్టం తేవాలని చురకలంటించారు.

రీసెంటుగా వైసీపీ అధినేత జగన్ ఓ జాతీయ చానెల్‌ తో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే రెండు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఇలా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని విమర్శించడం విశేషం.

కాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని - వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ముందు ఆయా ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారని అన్నారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు తగవని ఆయన అన్నారు. మొత్తానికి ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ నేతలు చంద్రబాబుకు మరింతగా చుక్కలు చూపించేటట్లున్నారు.