Begin typing your search above and press return to search.

బ‌రిలోకి రాజు గారు!...గంటా గెలుస్తారా?

By:  Tupaki Desk   |   17 March 2019 1:12 PM GMT
బ‌రిలోకి రాజు గారు!...గంటా గెలుస్తారా?
X
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌రుగుతున్న కీల‌క ఎన్నిక‌లు చాలా మంది నేత‌ల త‌ల రాత‌ను మార్చేలానే ఉన్నాయి. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో కీల‌క నేత‌లుగా ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్ పూర్తిగా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుని త‌మ త‌న‌యుల‌ను రంగంలోకి దించేశారు. అదే వ‌రుస‌లో అదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మంత్రి ప‌రిటాల సునీత కూడా రంగం నుంచి త‌ప్పుకుని త‌న కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌ ను బ‌రిలోకి దించేశారు. ఇదంతా స్వీయ నిర్ణ‌యాల‌తోనే జ‌ర‌గ‌గా... టీడీపీలోనే కాకుండా ఏ పార్టీలోకి వెళ్లినా... కీల‌క నేత‌గానే కొనసాగుతున్న మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఓ సారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోమారు పోటీకి స‌సేమిరా అంటున్న గంటా... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి గెలిచారు. తాజాగా ఆయ‌న భీమిలి కోస‌మే ప‌ట్టుబ‌ట్టిన‌ట్టుగా ప్ర‌చారం సాగినా... ఎందుక‌నో గానీ ఆయ‌న‌కు విశాఖ ఉత్త‌ర సీటు కేటాయించారు. దానిని గంటానే ఆశించారో - లేదంటే పార్టీ అధిష్ఠాన‌మే తీర్మానించిందో తెలియ‌దు గానీ... మొత్తంగా ఓట‌మంటూ ఎరుగ‌ని నేత‌గా కొన‌సాగుతున్న గంటాకు ఈ ద‌ఫా మాత్రం షాక్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కొన‌సాగుతున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ పొత్తు పెట్టుకుని సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు లేదు. ఈ నేప‌థ్యంలో గంటాకు ఏ ఫ‌లితం వ‌స్తుంద‌న్న విష‌యంపై ఆసక్తి నెల‌కొంది.

విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంపై విష్ణు పూర్తిగా ప‌ట్టు సాధించార‌నే చెప్పాలి. బీజేపీతో టీడీపీ మైత్రి కొన‌సాగిన కాలంలోనూ టీడీపీ అవినీతిపై త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నాస్త్రాలు సంధించిన విష్ణు... అసెంబ్లీలోనూ త‌న‌దైన ముద్ర చూపించారు. ఇక సొంత నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో గ‌ళం విప్పిన రాజు... నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై భ‌రోసా క‌లిగించారు. కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు కూడానూ. ఈ నేప‌థ్యంలో విశాఖ ఉత్త‌ర సీటుపై విష్ణు దాదాపుగా ఖ‌ర్చీఫ్ వేసుకున్నట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇలాంటి సీటుపై దృష్టి పెట్టిన గంటాకు ఈ సారి ఓట‌మి త‌ప్ప‌దా ? అన్న విశ్లేష‌ణ‌లు కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.