Begin typing your search above and press return to search.

బీజేపీ కామెడీ కంటిన్యూ...ఎవరు విడగొడతారు సామీ...?

By:  Tupaki Desk   |   28 Oct 2022 12:30 PM GMT
బీజేపీ కామెడీ కంటిన్యూ...ఎవరు విడగొడతారు సామీ...?
X
ఏపీలో మూడవ రాజకీయ ప్రాంతీయ పార్టీగా జనసేన ఉంది. జాతీయ స్థాయిలో ఘనంగా వెలుగుతున్నా ఏపీలో మాత్రం సన్న సన్నగానే కమలం కాంతులు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలసి 2020 మొదట్లో జట్టు కట్టాయి. ఆనాడు ఎవరిని అడిగి ఈ పార్టీలు మిత్రులుగా కలిశాయి అంటే జవాబు ఉండదు కదా. అది ఆ రెండు పార్టీల ఇష్టం. రాజ్యాంగం కల్పించిన అవకాశం. ఆ మేరకు పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చాయి. అంతే కాదు ఏపీలో తాము థర్డ్ ఆల్టర్నేషన్ అని కూడా గట్టిగా ప్రకటించుకున్నాయి.

ఇపుడు రెండున్నరేళ్ళు అయిన తరువాత జనసేన టీడీపీ మళ్ళీ పొత్తులోకి వెళ్తున్నాయన్న సూచనలు వచ్చిన మీదట బీజేపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ చెబుతున్న మాటలు కామెడీగానే ఉన్నాయని అనుకోవాలి. తడవకోమారు జనసేనతో మా పొత్తు కొనసాగుతోంది అని ఎందుకు ప్రకటించుకోవాల్సి వస్తుందో ఏపీకి చెందిన కమలనాధులు మాత్రమే చెప్పాలి.

నిజానికి పవన్ తమ పక్కన ఉంటారు. ఆయన తమ వారే అని జాతీయ పార్టీగా అతిశయం చూపించింది బీజేపీ అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒక విధంగా పవన్ని లైట్ గా తీసుకుంది అని కూడా అంటారు. దాని ఫలితమే ఇపుడు ఆయన తన టైం చూసుకుని టీడీపీకి పచ్చ జెండా ఊపారని కూడా అంటారు. ఇదే పవన్ మార్చి నెలలో తన పార్టీ ఆవిర్భావ సభలో రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలని కోరారు. మరి నాడు కనుక రోడ్ మ్యాప్ బీజేపీ ఇచ్చి ఉంటే కధ ఇంతదాకా వచ్చేది కాదు కదా.

అంటే చేయాల్సింది ఏదో వారూ వారూ చేసుకున్నారు. ఇపుడు మా జంటను విడగొట్టే సాసహం ఎవరూ చేయలేరని గంభీరమైన ప్రకటనలు ఇస్తున్నారు. నిన్నటికి నిన్న సోము వీర్రాజు ఒక వీడియో రిలీజ్ చేసి మరీ జనసేంతో జనంతో మాత్రమే మా పొత్తు అని ప్రకటించారు. అసలు ఆయన ఎందుకు అలా అర్జంటుగా ప్రకటించాల్సి వచ్చిందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

ఆయన వంతు అలా ముగియగానే బీజేపీలో సోము వీర్రాజు వర్గంగా పేరున్న విష్ణు వర్ధన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి బీజేపీ జనసేన జంటను ఎవరూ దూరం చేయలేరని సెంటిమెంటల్ డైలాగులు వల్లించారు. అంతే కాదు పవన్ ఎప్పటికీ బీజేపీకి మిత్రుడే అని మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిజానికి బీజేపీలోనే సోముని వ్యతిరేకిస్తున్న మరో వర్గం నుంచి ఇలాంటి ఒక్కటంటే ఒక్క ప్రకటన అయితే రావడం లేదు

ఈ మధ్యనే బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుని టార్గెట్ గా చేసుకునే ప్రకటనలు చేశారు. ఒక విధంగా విమర్శలు చేశారు. సోము వీర్రాజు నాయకత్వం వల్లనే జనసేన పొత్తుకు దూరంగా జరిగింది అన్నది సోము వ్యతిరేకుల వాదన. ఇలా బీజేపీలోనే ఒక పెద్ద వ్యతిరేక వర్గం సోమునే ఈ విషయంలో నిందిస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనసేన వైపు నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా బీజేపీతో తమ పొత్తు ఉందని కానీ బీజేపీ తమ మిత్రుడే అని కానీ గట్టిగా చెప్పడంలేదు.

అంటే తెర వెనక చాలానే జరుగుతున్నాయని అనుకోవాలి. అంటే బీజేపీ నేతలు సోము వర్గం వారే బయటకు వచ్చి జనసేన మిత్రుడు అని అంటున్నా బీజేపీలో హోల్ మొత్తంగా కానీ ఇదే మాటను చెప్పడంలేదు, అలాగే జనసేన నుంచి ఒక్క గొంతూ పలకడంలేదు. సీన్ ఇలా ఉంటే మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల కామెడీ తప్ప మరేమీ జరగదు అని బీజేపీ వారు ఆలోచిస్తే మంచిదేమో. ఏది ఏమైనా జనసేన దూరం జరగడం అంటే అది సోము వీర్రాజు నాయకత్వం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుస్తోంది అని అంటున్నారు. ఇపుడు సోము పదవికీ బీజేపీలో చిచ్చుకూ జనసేనానితో చంద్రబాబు షేక్ హ్యాండ్ కారణం అయింది అంటున్నారు.

ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎక్కడా చేతికి మట్టి అంటకుండా మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా చేసుకున్న వారు మాత్రం టీడీపీ అధినాయకత్వం పెద్దలే అని అంటారు. మొత్తానికి బీజేపీ గూటి నుంచి మిత్రుడిని తన వైపు ఆకర్షించుకున్న చంద్రుడిని ఏమీ అనలేని దైన్యంలో కమలనాధులు ఉన్నారని అనుకోవాలేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.